Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్మగ్లర్ల దాడి.. అటవీ సిబ్బందికి అండగా పవన్ కళ్యాణ్.. !

స్మగ్లర్ల దాడి.. అటవీ సిబ్బందికి అండగా పవన్ కళ్యాణ్.. !

ర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించిన అటవీ శాఖ సిబ్బందిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ అభినందించారు.

విధి నిర్వహణలో గాయపడిన సిబ్బందికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని హామీ ఇస్తూనే, అక్రమ రవాణాదారులపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అన్నమయ్య జిల్లా రొంపిచెర్ల మండలం బొమ్మాయిగారిపల్లి సమీపంలో 'ఆపరేషన్ అరణ్య'లో భాగంగా ఎర్రచందనం స్మగ్లర్లను అడ్డుకునేందుకు వెళ్లిన అటవీ శాఖ బృందంపై దుండగులు వాహనంతో ఢీకొట్టిన ఘటనను ఉప ముఖ్యమంత్రి తీవ్రంగా పరిగణించారు. ఘటనపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు.

ఈ ఘటనలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కె. ప్రకాష్ కుమార్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు పి. రెడ్డి ప్రసాద్, కె. ప్రతాప్‌తో పాటు శాఖ వాహన డ్రైవర్ చరణ్ గాయపడినట్లు అధికారులు పవన్ కళ్యాణ్‌కు వివరించారు. ప్రస్తుతం గాయపడిన సిబ్బంది ప్రమాదం నుంచి బయటపడి చికిత్స పొందుతున్నారని తెలిపారు.

గాయపడిన ప్రతి ఒక్కరికీ అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని, వారి చికిత్సకు అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సిబ్బంది పూర్తిగా కోలుకునే వరకు అటవీ ముఖ్య సంరక్షణాధికారి (PCCF) ప్రత్యేకంగా పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు.

'ఆపరేషన్ అరణ్య'లో అటవీ శాఖ సిబ్బంది ప్రాణాలకు తెగించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు భారీ మొత్తంలో ఎర్రచందనం దుంగలు, తూకం యంత్రం, రంపం బ్లేడ్‌లు, గొడ్డళ్లు, అక్రమ రవాణాకు ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం అభినందనీయమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న ప్రతి అధికారిని, సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

ఎర్రచందనం అక్రమ రవాణా, అటవీ నేరాలు, ప్రభుత్వ సిబ్బందిపై దాడులు వంటి ఘటనలను ప్రభుత్వం ఏమాత్రం సహించబోదని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అటవీ సంపదను దోచుకునే వారిపై చట్టప్రకారం అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దని అధికారులకు సూచించారు.

ప్రస్తుతం పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితులను వీలైనంత త్వరగా పట్టుకునేందుకు విస్తృతంగా గాలింపు చేపట్టాలని రెడ్ శాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అక్రమ రవాణా ముఠాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తూ అటవీ నేరాల నియంత్రణలో కూటమి ప్రభుత్వం రాజీలేని వైఖరితో ముందుకు సాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

ఎర్రచందనం స్మగ్లింగ్‌ను పూర్తిగా అరికట్టేందుకు అటవీ శాఖ చేపడుతున్న చర్యలకు ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఉంటుందని, విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించే సిబ్బంది సంక్షేమానికి అన్ని విధాలా అండగా నిలుస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin