Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్పోర్ట్స్ డీఎస్సీ నియామకాలపై ఆరోపణలు నిరాధారం: ఎస్‌ఏఏపీ

స్పోర్ట్స్ డీఎస్సీ నియామకాలపై ఆరోపణలు నిరాధారం: ఎస్‌ఏఏపీ

TeluguBulletin.com 3 weeks ago

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (ఎస్‌ఏఏపీ) స్పోర్ట్స్ డీఎస్సీ-2025 నియామక ప్రక్రియపై ఇటీవల మీడియాలో వచ్చిన ఆరోపణలను ఖండించింది. నియామకాలు పూర్తిగా పారదర్శకంగా, ఆన్‌లైన్ విధానంలో మరియు బహుళస్థాయి ధృవీకరణల ఆధారంగా నిర్వహించామని స్పష్టం చేసింది.

ఎస్‌ఏఏపీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, మే 1, 2025న 421 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా సుమారు 3,600 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. నియామక ప్రక్రియలో ఎలాంటి బయటి జోక్యం లేదా ప్రలోభాలకు అవకాశం లేకుండా అన్ని దశలను ఆన్‌లైన్‌లో నిర్వహించినట్లు పేర్కొంది.

క్రీడా సర్టిఫికెట్ల అంశంపై కూడా సంస్థ వివరణ ఇచ్చింది. ఎస్‌ఏఏపీ సర్టిఫికెట్లు జారీ చేయదని, వాటిని సంబంధిత క్రీడా సంఘాలు, ఫెడరేషన్లు, విశ్వవిద్యాలయాలే జారీ చేస్తాయని తెలిపింది. అభ్యర్థులు సమర్పించిన ప్రతి సర్టిఫికెట్‌ను సంబంధిత సంస్థలకు పంపించి, అధికారిక ధృవీకరణ అనంతరం మాత్రమే మెరిట్ జాబితాలో పరిగణనలోకి తీసుకున్నట్లు వెల్లడించింది.

పోస్టుల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్లు ప్రచారంలోకి వచ్చిన ఫేక్ ఆడియోలపై కూడా సంస్థ స్పందించింది. ఈ వ్యవహారంపై జూలై 25న విజయవాడ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయగా, సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపింది.

ఎంపిక ప్రక్రియలో తొలిసారిగా ప్రాథమిక మెరిట్ జాబితాను ఆన్‌లైన్‌లో ప్రచురించి, అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించి వాటిని పరిశీలించిన తర్వాతే తుది జాబితాను ఖరారు చేసినట్లు ఎస్‌ఏఏపీ పేర్కొంది. స్క్రీనింగ్ కమిటీ నివేదిక, రాష్ట్ర స్థాయి కమిటీ సమీక్ష అనంతరమే ఎంపికలకు ఆమోదం లభించిందని వివరించింది.

కొంతమంది అభ్యర్థుల జనన తేదీలు, స్థానికత అంశాలపై వచ్చిన ఆరోపణలను కూడా సంస్థ తోసిపుచ్చింది. సంబంధిత పత్రాలన్నీ సరైనవేనని, క్రీడా ఫెడరేషన్లు కూడా వాటిని ధృవీకరించాయని వెల్లడించింది. స్థానికత, రిజర్వేషన్లు, పోస్టుల కేటాయింపులు విద్యాశాఖ పరిధిలోకి వస్తాయని, తమ పాత్ర కేవలం క్రీడా మెరిట్ ధృవీకరణ వరకే పరిమితమని స్పష్టం చేసింది.

తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తులు, సంస్థలపై సివిల్ మరియు క్రిమినల్ పరువు నష్టం దావాలతో సహా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఏఏపీ హెచ్చరించింది. నిజమైన క్రీడాకారుల ప్రయోజనాల పరిరక్షణకు సంస్థ కట్టుబడి ఉందని పేర్కొంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin