స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై జనసేన పార్టీ దృష్టి సారించింది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, క్షేత్రస్థాయి సమన్వయం వంటి అంశాలపై పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన సందేశాన్ని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్థానిక సంస్థల ఎన్నికల కమిటీ సభ్యులకు వివరించారు.
శుక్రవారం మంగళగిరిలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల కమిటీ సమావేశంలో ఎన్నికల వ్యూహాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించే వ్యూహాలు సాధారణ ఎన్నికలకు భిన్నంగా ఉంటాయని, అభ్యర్థుల ఎంపిక దశ నుంచే పార్టీ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ముందుకు సాగాలని పవన్ కళ్యాణ్ సూచించినట్లు తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించడమే పార్టీ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ముందుగా నగరపాలక, పురపాలక సంస్థల ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించాలని, ప్రతి డివిజన్, వార్డులో పార్టీ బలాబలాలను అంచనా వేసి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని సూచించారు.
రాష్ట్ర స్థాయిలో కూటమి సమన్వయ కమిటీ చర్చలు కొనసాగుతున్నాయని, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో కూడా సమన్వయ కమిటీలు పనిచేస్తాయని నాదెండ్ల మనోహర్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల కమిటీ సభ్యులకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా బాధ్యతలు అప్పగించనున్నట్లు వెల్లడించారు.
కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యటించి జనసైనికులు, వీర మహిళలను కలిసి వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని, క్యాడర్‌లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ ఎన్నికలకు సిద్ధం చేయాలని సూచించారు. ప్రతి నియోజకవర్గం నుంచి సమగ్ర నివేదికలను పార్టీ కేంద్ర కార్యాలయానికి అందించాలని కూడా ఆయన పేర్కొన్నారు.
ఈ సమావేశంలో మండలి బుద్ధ ప్రసాద్, టి. శివశంకర్, కందుల దుర్గేష్, వల్లభనేని బాలశౌరి, బొలిశెట్టి శ్రీనివాస్, దేవ వరప్రసాద్, సీహెచ్ వంశీకృష్ణ యాదవ్, లోకం మాధవి, పత్సమట్ల ధర్మరాజు, చిలకం మధుసూదన్ రెడ్డి, కొటికలపూడి గోవిందరావు, సామినేని ఉదయభాను, యనమల భాస్కర్, కొరికాన రవికుమార్‌తో పాటు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి పాల్గొన్నారు.

