Chiranjeevi - Bobby Kolli కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం #Chiru158 / #ChiruBobby2 పై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. 'వాల్తేరు వీరయ్య' తర్వాత మరోసారి ఈ హిట్ కాంబో కలిసి పనిచేస్తుండటంతో సినీ వర్గాల్లోనూ ఆసక్తి పెరిగింది.
ప్రముఖ నిర్మాణ సంస్థ KVN Productions బ్యానర్‌పై నిర్మాత వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఇటీవల పవర్ స్టార్ Pawan Kalyan సమక్షంలో ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నేడు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి షెడ్యూల్‌లో చిరంజీవి, అనశ్వర రాజన్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కథలో ఈ ఎపిసోడ్స్ చాలా ముఖ్యమైనవిగా ఉండనున్నాయని చిత్ర యూనిట్ చెబుతోంది.
షూటింగ్ ప్రారంభం సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన బీటీఎస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో చిరంజీవి ఎంతో ఎనర్జీగా కనిపిస్తూ "లెట్స్ సెట్ ది బ్లడీ బెంచ్‌మార్క్" అంటూ ఉత్సాహం నింపారు. అనంతరం దర్శకుడు బాబీని టైటిల్ గురించి అడగగా, ఆయన దాటవేయడానికి ప్రయత్నించడంతో చిరంజీవి సరదాగా "సరైన సమయంలో నేనే టైటిల్ లీక్ చేస్తానేమో" అంటూ చేసిన కామెంట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ ఫన్నీ సంభాషణతో సినిమాపై మరింత క్యూరియాసిటీ పెరిగింది.
దర్శకుడు బాబీ కొల్లి ఈసారి మరింత భారీ స్థాయిలో కథను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో చిరంజీవి తన కెరీర్‌లోనే అత్యంత పవర్‌ఫుల్, ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇందుకోసం ఆయన ప్రత్యేక ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కూడా అయ్యారని తెలుస్తోంది. యువ నటి అనశ్వర రాజన్ మెగాస్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాకు టాప్ టెక్నికల్ టీమ్ పని చేస్తోంది. సంగీతాన్ని S. Thaman అందిస్తుండగా, సినిమాటోగ్రఫీని విజయ్ కార్తిక్ కన్నన్ నిర్వహిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైన్ అవినాశ్ కొల్లా, ఎడిటింగ్ ఆంటోని ఎల్. రూబెన్ చేపడుతున్నారు. కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తుండగా, భాను-నందు సంభాషణలు రాస్తున్నారు.
హీరోయిన్‌తో పాటు ఇతర ప్రధాన తారాగణానికి సంబంధించిన వివరాలను త్వరలో ప్రకటించనున్నట్లు మేకర్స్ తెలిపారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రం మెగాస్టార్ అభిమానులకు మరో మాస్ ట్రీట్‌గా నిలవనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

