Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణలో జనసేన బలోపేతమే పవన్ కళ్యాణ్ ఆదేశం: తాళ్లూరి రామ్

తెలంగాణలో జనసేన బలోపేతమే పవన్ కళ్యాణ్ ఆదేశం: తాళ్లూరి రామ్

తెలంగాణలో జనసేన పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడమే అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశమని, ప్రతి కార్యకర్త అదే లక్ష్యంతో ముందుకు సాగాలని జనసేన ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ పిలుపునిచ్చారు.

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నిర్వహించిన చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

తెలంగాణపై పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేకమైన అభిమానం ఉందని, రాష్ట్ర ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ వాటి పరిష్కారం కోసం కృషి చేశారని తాళ్లూరి రామ్ అన్నారు. పార్టీ బలోపేతంలో వేలాది మంది 'సాధక్'లు, లక్షలాది మంది 'ఉద్యమి'లు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. 2014 నుంచి పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న కార్యకర్తలను ఈ సందర్భంగా ప్రత్యేకంగా సత్కరించారు.

యువత రాజకీయాల్లోకి రావాలని, సామాన్య ప్రజలకు నాయకత్వం వహించే స్థాయికి ఎదగాలని పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో ప్రోత్సహిస్తున్నారని తాళ్లూరి రామ్ తెలిపారు. నాలుగేళ్ల క్రితం మొయినాబాద్‌లో జరిగిన సభలో పార్టీలో చేరిన స్థానిక యువకుడు ప్రజీత్ గౌడ్ నేడు నాయకుడిగా ఎదగడం అందుకు నిదర్శనమని చెప్పారు. అలాగే వీరమహిళగా పార్టీలో చేరిన తనూజా రెడ్డి ప్రజా సమస్యలపై అధ్యయనం చేస్తూ నాయకురాలిగా ఎదుగుతున్న తీరు అభినందనీయమని అన్నారు.

జనసేన ప్రధాన కార్యదర్శిగా తనకు అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని తాళ్లూరి రామ్ పేర్కొన్నారు. పార్టీ మరింత విస్తరించేందుకు ప్రతి కార్యకర్త కష్టపడాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో జనసేన ప్రచార కార్యదర్శి సాగర్ ఆర్.కె. నాయుడు మాట్లాడుతూ, ఒక్క వ్యక్తిగా ప్రారంభమైన పవన్ కళ్యాణ్ ప్రయాణం నేడు లక్షలాది మంది కార్యకర్తలకు స్ఫూర్తిగా మారిందన్నారు. ప్రజలు తమ సమస్యలకు జనసేన వేదికగా నిలుస్తుందని విశ్వసిస్తున్నారని తెలిపారు. 2014 నుంచి పార్టీ జెండాను మోస్తూ వస్తున్న కార్యకర్తలను ప్రత్యేకంగా అభినందించారు.

కార్యక్రమంలో పలువురు రాష్ట్ర నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక యువకులు పెద్ద సంఖ్యలో జనసేన పార్టీలో చేరడం విశేషంగా నిలిచింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin