Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణలో పవన్ కీలక సమావేశం.. జూన్ 2న ఏం ప్రకటించబోతున్నారు?

తెలంగాణలో పవన్ కీలక సమావేశం.. జూన్ 2న ఏం ప్రకటించబోతున్నారు?

TeluguBulletin.com 3 weeks ago

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ జూన్ 2న హైదరాబాద్‌లో కీలక సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశానికి పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు.

రాష్ట్రంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.

తెలంగాణలో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. రాష్ట్రంలో జనసేన పార్టీ బలోపేతం, సంస్థాగత విస్తరణ, భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై పవన్ కళ్యాణ్ కీలకంగా మాట్లాడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అలాగే తెలంగాణలో జనసేన పార్టీ కార్యాచరణకు సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రకటనలు కూడా చేసే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యల చుట్టూ నెలకొన్న వివాదం, దానికి కొనసాగింపుగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో చోటుచేసుకున్న ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ పరిణామాలపై కూడా పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో స్పష్టమైన, దృఢమైన స్పందన ఇవ్వొచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున జరుగుతున్న ఈ సమావేశం ద్వారా జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో తన భవిష్యత్ ప్రణాళికలను స్పష్టంగా వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ సమావేశంపై పార్టీ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin