Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టీడీపీ, జనసేన 'ఫ్రెండ్లీ ఫైట్'.! పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం.!?

టీడీపీ, జనసేన 'ఫ్రెండ్లీ ఫైట్'.! పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం.!?

టీడీపీ, జన సేన, బీజేపీ.. కూటమిగా ఏర్పడ్డాయి 2024 ఎన్నికల కోసం.! ఈ మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే.

కలిసి కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్నా, మూడు పార్టీల మధ్య.. అందునా, టీడీపీ - జన సేన మధ్య కార్యకర్తల స్థాయిలో కొంత అలజడి వుంది.

'కుటుంబం పెద్దదయ్యింది.. అందరం కలిసి పని చేద్దాం..' అని టీడీపీ నేత నారా లోకేష్, తమ కార్యకర్తల్ని సముదాయిస్తున్నారు. 'రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇంకో రెండు దఫాలు కలిసి ఎన్నికల్లో పోటీ చేద్దాం..' అని తమ కార్యకర్తలకు జన సేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పిలుపునిస్తున్నారు.

స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధమయిన దరిమిలా, ఇప్పుడు 'ఫ్రెండ్లీ ఫైట్' అంశం తెరపైకొచ్చింది. జన సేన అధినేత పవన్ కళ్యాణ్, తమ నేతలు అలానే కార్యకర్తల్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కథనాలు చూస్తున్నాం. సోషల్ మీడియాలో జన సేన కార్యకర్తలూ ఇదే మాట చెబుతున్నారు.

అసలు ఫ్రెండ్లీ ఫైట్ అంటే ఏంటి.? రెండు పార్టీలూ బలంగా వున్న చోట, పోటీదారులు వెనక్కి తగ్గనప్పుడు.. స్నేహపూర్వక పోటీ తప్పదు. నిజానికి, స్థానిక ఎన్నికల్లో చాలా సర్వసాధారణం ఈ స్నేహ పూర్వక పోటీ. ఇదొక వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడ లాంటిది కూడా.

టీడీపీ - జన సేన.. విడిపోతే, తమకు లాభం.. అని వైసీపీ భావిస్తోంది. ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా పరోక్షంగా చెబుతూ వస్తున్నారు. కూటమిలో కుంపట్లు తారాస్థాయికి చేరి, ఎవరికి వారు విడిపోతేనే తమకు అధికారం వస్తుందన్న భావనలో వైఎస్ జగన్ వున్నారు.

ఈ క్రమంలో కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు వైఎస్ జగన్ చెయ్యని ప్రయత్నమే లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతూనే వస్తున్నారు వైఎస్ జగన్, కూటమిని విడగొట్టే క్రమంలో.

నిజానికి, స్థానిక ఎన్నికల్లో 'స్నేహ పూర్వక పోటీ' అనేది, టీడీపీ - జన సేన మధ్య నడుస్తున్న పొత్తుకు వ్యతిరేకంగా వుండనే వుండదు. ఇదే విషయాన్ని జన సేనాని పవన్ కళ్యాణ్, తమ పార్టీ నేతలు అలానే కార్యకర్తలకు స్పష్టతనిచ్చినట్లు తెలుస్తోంది. అదే సమయంలో, టీడీపీ కూడా ఫ్రెండ్లీ ఫైట్ విషయమై సానుకూలంగానే వుంది.

కింది స్థాయిలో నాయకుల సంతృప్తి కోసం.. ఇలాంటి చిన్న చిన్న 'స్నేహ పూర్వక పోటీ' సహజమే. ఆ మాటకొస్తే, ఒక్కోసారి బద్ద వైరం వున్న పార్టీలు కూడా 'స్థానిక ఎన్నికల్లో' కలిసి పని చేయడం చూస్తుంటాం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin