Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉపాధి పనులకు వెళ్లి ప్రాణాలు కోల్పోవడం బాధాకరం: పవన్ కళ్యాణ్

ఉపాధి పనులకు వెళ్లి ప్రాణాలు కోల్పోవడం బాధాకరం: పవన్ కళ్యాణ్

కాకినాడ రూరల్ మండలం పరిధిలో జరిగిన విషాదకర రోడ్డు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనులకు వెళ్లిన మహిళా శ్రామికులు రోడ్డు దాటుతున్న సమయంలో టిప్పర్ ఢీకొని నలుగురు మహిళలు మృతి చెందడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు.

చీడిగ గ్రామానికి చెందిన ఆరుగురు మహిళా శ్రామికులు పని ప్రదేశం వద్ద రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన టిప్పర్ వాహనం ఢీకొట్టినట్లు అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన పవన్ కళ్యాణ్ మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

గాయపడిన వారికి మెరుగైన వైద్యసాయం అందించాలని కాకినాడ జిల్లా అధికారులను ఆదేశించినట్లు ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. వారు పూర్తిగా కోలుకునే వరకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అలాగే మృతి చెందిన ఉపాధి శ్రామికుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం పెంచిన రూ.4 లక్షల పరిహారాన్ని త్వరితగతిన అందజేస్తామని తెలిపారు.

అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.2 లక్షల ఆర్థిక సాయం, పీఎం సురక్ష యోజన, పీఎం జీవన్ జ్యోతి యోజన కింద లభించే బీమా మొత్తాన్ని కూడా బాధిత కుటుంబాలకు అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా పని ప్రదేశాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ముఖ్యంగా జాతీయ రహదారులు, బైపాస్ రోడ్లు, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల వద్ద ఉపాధి పనులు జరుగుతున్నప్పుడు వేగ నియంత్రణ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. శ్రామికుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin