విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో తెరకెక్కుతున్న భారీ ఎంటర్‌టైనర్ 'ఆదర్శ కుటుంబం - AK47' విడుదల తేదీ మారింది. తొలుత ప్రకటించిన తేదీకి బదులుగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 9, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
ప్రేక్షకులకు మరింత మెరుగైన వినోదాత్మక అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో సినిమాను వారం రోజుల పాటు వాయిదా వేసినట్లు మేకర్స్ తెలిపారు. దీంతో వెంకటేష్ అభిమానులు మరో వారం ఎదురుచూడాల్సి వచ్చినా, సినిమాపై అంచనాలు మాత్రం మరింత పెరిగాయి.
ఇటీవల విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. మధ్యతరగతి కుటుంబం నేపథ్యంలో వెంకటేష్ పాత్రను పరిచయం చేస్తూ హాస్యం, భావోద్వేగాలు, యాక్షన్‌ను సమతూకంగా చూపించిన టీజర్ సోషల్ మీడియాలో మంచి ఆదరణ పొందింది. త్రివిక్రమ్ శైలిలో కుటుంబ కథతో పాటు వినోదాన్ని అందించే చిత్రంగా 'ఆదర్శ కుటుంబం - AK47'పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. నారా రోహిత్, నివేదా పేతురాజ్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, తమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. కుటుంబ భావోద్వేగాలు, వినోదం, యాక్షన్ అంశాల సమ్మేళనంగా రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం - AK47' ఇప్పుడు అక్టోబర్ 9, 2026న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

