
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో ఆసక్తికర గణాంకాలను వెల్లడించారు. 2024 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మరింత బలపడిందని, అదే సమయంలో వైఎస్సార్సీపీ ఓటు శాతం గణనీయంగా తగ్గిందని ఆయన పేర్కొన్నారు.
ప్రజలు మరోసారి కూటమి పాలనకు మద్దతు తెలిపారని ఆయన వ్యాఖ్యానించారు.
చంద్రబాబు వెల్లడించిన వివరాల ప్రకారం, స్థానిక సంస్థల పట్టణాలు, పరిషత్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మొత్తం 58.9 శాతం ఓట్లను సాధించింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈ ఓటు శాతం 55.3 శాతంగా ఉండగా, ఇప్పుడు మరో 3.6 శాతం పెరిగిందని తెలిపారు. మరోవైపు వైఎస్సార్సీపీకి స్థానిక ఎన్నికల్లో 33.56 శాతం ఓట్లు మాత్రమే లభించగా, 2024 ఎన్నికల్లో వచ్చిన 39.81 శాతంతో పోలిస్తే 6.25 శాతం తగ్గిందన్నారు. దీంతో కూటమి, వైఎస్సార్సీపీ మధ్య ఓట్ల వ్యత్యాసం 25.34 శాతానికి చేరిందని వివరించారు.
పట్టణ ప్రాంతాల్లో ఎన్డీఏకు 59.9 శాతం ఓట్లు లభించగా, వైఎస్సార్సీపీకి 34.3 శాతం మాత్రమే వచ్చాయని చెప్పారు. పట్టణాల్లో ఎన్డీఏ స్ట్రైక్ రేట్ 94 శాతంగా నమోదైందన్నారు. జడ్పీటీసీ ఎన్నికల్లో ఎన్డీఏ 57.6 శాతం ఓట్లను సాధించగా, వైఎస్సార్సీపీ 39.7 శాతం ఓట్లు పొందిందని, అక్కడ ఎన్డీఏ స్ట్రైక్ రేట్ 87.5 శాతంగా ఉందని తెలిపారు. పట్టణాల్లో కూటమికి వైఎస్సార్సీపీపై 25.60 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 17.9 శాతం ఓట్ల ఆధిక్యం నమోదైందని వెల్లడించారు.
ఎంపీటీసీ ఎన్నికల్లో మొత్తం 9,818 స్థానాలకు గానూ కూటమి 7,803 స్థానాలను గెలుచుకుందని సీఎం చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 90 శాతం మండల అధ్యక్ష స్థానాలు కూడా కూటమి ఖాతాలోకి వెళ్లే అవకాశముందని పేర్కొన్నారు.
పోస్టల్ బ్యాలెట్లలోనూ కూటమికే ప్రజల మద్దతు లభించిందని చంద్రబాబు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ఎన్డీఏకు 65.7 శాతం పోస్టల్ బ్యాలెట్లు రాగా, వైఎస్సార్సీపీకి 27.42 శాతం మాత్రమే వచ్చాయని చెప్పారు. పరిషత్ ఎన్నికల్లో ఎన్డీఏకు 62.83 శాతం, వైఎస్సార్సీపీకి 31.46 శాతం పోస్టల్ బ్యాలెట్లు నమోదయ్యాయని వివరించారు.
జెడ్పీటీసీ ఎన్నికల్లో మొత్తం 659 స్థానాలకు గానూ కూటమి 575 స్థానాలను గెలుచుకుందని సీఎం వెల్లడించారు. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 27 జిల్లాల్లో కూటమి ఆధిక్యం సాధించగా, అల్లూరి సీతారామరాజు జిల్లాలో మాత్రమే వైఎస్సార్సీపీ ఎక్కువ జెడ్పీటీసీ స్థానాలు గెలుచుకుందని చెప్పారు. అంతేకాకుండా ఏడు జిల్లాల్లో వైఎస్సార్సీపీ ఒక్క జెడ్పీటీసీ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయిందని పేర్కొన్నారు. అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, మార్కాపురం, పల్నాడు, పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల్లో వైఎస్సార్సీపీ ఖాతా కూడా తెరవలేదని తెలిపారు.

