Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వెయ్యి ఎకరాల్లో డ్రోన్లతో సీడ్ బాల్స్.. పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

వెయ్యి ఎకరాల్లో డ్రోన్లతో సీడ్ బాల్స్.. పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో అడవుల పునరుద్ధరణను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీడ్ బాల్స్ పంపిణీ కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తోంది. మనుషులు చేరుకోలేని అటవీ ప్రాంతాల్లో డ్రోన్ల సాయంతో సీడ్ బాల్స్ వెదజల్లే ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు.

వర్షపాతం, నేలలో తేమ వంటి పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తూ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.

శనివారం అటవీశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా సీడ్ బాల్స్ పంపిణీ, డ్రోన్ల వినియోగం, ఇప్పటి వరకు సాధించిన పురోగతి, భవిష్యత్ లక్ష్యాలపై పవన్ కళ్యాణ్ సమీక్షించారు. రాష్ట్రంలో 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యాన్ని సాధించడంలో ఈ కార్యక్రమం కీలకమని ఆయన పేర్కొన్నారు.

అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 3 కోట్లకు పైగా సీడ్ బాల్స్ సిద్ధం చేశారు. వాటిలో ఇప్పటి వరకు 63 లక్షలకు పైగా సీడ్ బాల్స్‌ను దాదాపు 6,500 హెక్టార్ల విస్తీర్ణంలో వెదజల్లే ప్రక్రియ పూర్తైంది. ఇందులో సుమారు 6 వేల హెక్టార్లలో మానవ వనరుల ద్వారా 59 లక్షల సీడ్ బాల్స్ పంపిణీ చేయగా, తొలిసారిగా డ్రోన్ల సహాయంతో దాదాపు వెయ్యి ఎకరాల్లో సీడ్ బాల్స్ జారవిడిచారు. మనుషులు అడుగుపెట్టలేని లోయలు, దట్టమైన అటవీ ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా సులభంగా చేరుకుని విత్తన బంతులను వెదజల్లినట్లు అధికారులు తెలిపారు.

రాజమహేంద్రవరం అటవీ సర్కిల్‌లో అత్యధికంగా 28 లక్షల సీడ్ బాల్స్ వెదజల్లగా, వాటిలో 2.26 లక్షలను డ్రోన్ల ద్వారా పంపిణీ చేశారు. విశాఖ అటవీ డివిజన్‌లో 7.50 లక్షలు, కర్నూలు అటవీ ప్రాంతంలో 8.67 లక్షల సీడ్ బాల్స్ వెదజల్లినట్లు అధికారులు వివరించారు. ప్రస్తుతం చింతూరు, పీటీ ఆత్మకూరు, గిద్దలూరు, మార్కాపురం, వైఎస్ఆర్ కడప డివిజన్లలో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా డ్రోన్ల సాయంతో సీడ్ బాల్స్ పంపిణీ కొనసాగుతోందని తెలిపారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ, వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో మాత్రం ఆలస్యం చేయకుండా సీడ్ బాల్స్ వెదజల్లాలని సూచించారు. అవసరమైతే మరిన్ని డ్రోన్లను వినియోగంలోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. అలాగే సీడ్ బాల్స్ వెదజల్లడమే కాకుండా మొలకెత్తే మొక్కలను సంరక్షించే బాధ్యతను కూడా అటవీశాఖ తీసుకోవాలని స్పష్టం చేశారు. 30 వేల హెక్టార్ల లక్ష్యాన్ని నిర్ణీత గడువులో పూర్తి చేసి రాష్ట్రంలో అటవీ విస్తీర్ణాన్ని పెంచే దిశగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin