Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై లోకేష్ ఫోకస్.. కీలక ఆదేశాలు

విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై లోకేష్ ఫోకస్.. కీలక ఆదేశాలు

మరావతి: రాష్ట్రంలో విద్యార్థుల మానసిక ఆరోగ్య పరిరక్షణకు పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు.

ఉండవల్లిలోని తన నివాసంలో పాఠశాల విద్య, ఉన్నత విద్య, స్కిల్ డెవలప్‌మెంట్ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

విద్యార్థుల్లో పెరుగుతున్న మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు అవగాహన, మార్గదర్శకత్వం, సంస్థాగత సహాయ వ్యవస్థలను కలిపి ప్రత్యేక కార్యక్రమాన్ని మిషన్ మోడ్‌లో అమలు చేయాలని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా అధికారులు విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి ఉపయోగపడే "కేర్ ఏపీ" టూల్‌ను సిద్ధం చేసి, పైలట్ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసినట్లు వివరించారు.

రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతలో 935 ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 4.47 లక్షల మంది విద్యార్థులకు హార్ట్‌ఫుల్ యోగా శిక్షణ అందించేందుకు చర్యలు వేగవంతం చేయాలని లోకేష్ ఆదేశించారు. ఇందుకోసం హైదరాబాద్‌లోని కన్హా శాంతి వనం సంస్థ సహకారంతో రెండు వేల మంది ఔత్సాహిక ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విద్యాసంవత్సరంలో హైబ్రిడ్ విధానంలో, వచ్చే ఏడాది నుంచి పూర్తిస్థాయిలో ప్రత్యక్ష యోగా శిక్షణ తరగతులు నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.

పాఠశాల విద్యలో అవసరమైన సంస్కరణలు పూర్తయ్యాయని, ఇకపై పూర్తిగా విద్యార్థుల ఫలితాల మెరుగుదలపై దృష్టి పెట్టాలని మంత్రి స్పష్టం చేశారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో 90 శాతం ఫలితాలు సాధించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని సూచించారు. కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ (KPI) లక్ష్యాలను అధిగమించేందుకు ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పారు.

విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో విద్యార్థులు, అధ్యాపకుల హాజరు శాతం పెంచేందుకు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) అమలు చేయాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న మిషన్ మార్చ్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు, అధికారులను అభినందించిన ఆయన, బోధనలో వెనుకబడిన ఉపాధ్యాయులకు మెంటార్ టీచర్ల ద్వారా ప్రత్యేక శిక్షణ తప్పనిసరి చేయాలని సూచించారు. అలాగే అక్షర ఆంధ్ర కార్యక్రమం ద్వారా వచ్చే ఏడాది చివరినాటికి రాష్ట్రంలో వంద శాతం అక్షరాస్యత సాధించాలనే లక్ష్యంతో పనిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

స్కిల్ డెవలప్‌మెంట్ శాఖ సమీక్షలో భాగంగా పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఐటీఐలను అభివృద్ధి చేయాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. పీఎం సేతు పథకం కింద తొలి విడతలో 10 పారిశ్రామిక అనుసంధానిత ఐటీఐ క్లస్టర్లను ఏర్పాటు చేసి, స్టీల్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఆక్వా, ఫార్మా రంగాల సంస్థలతో కలిసి 90 రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.

స్కిల్ డెవలప్‌మెంట్ శాఖ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 5.43 లక్షల మందికి నైపుణ్య శిక్షణ అందించగా, గత రెండేళ్లలో నిర్వహించిన జాబ్ మేళాల ద్వారా 1.72 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించినట్లు అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులో నిర్వహించే జాబ్ మేళాల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల భాగస్వామ్యాన్ని కూడా పెంచాలని మంత్రి లోకేష్ సూచించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin