సైన్స్ ఫిక్షన్, మైథాలజీ అంశాలతో తెరకెక్కుతున్న కొత్త తెలుగు చిత్రం "తక్షక" ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. మెగాస్టార్ చిరంజీవితో "విశ్వంభర" చిత్రాన్ని రూపొందిస్తున్న దర్శకుడు వశిష్ట మల్లిడి సోదరుడు కృష్ణ మల్లిడి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఈ చిత్రంలో కుశాల్ రాజు హీరోగా నటిస్తుండగా, ఎంఎస్ఆర్ క్రియేషన్స్ బ్యానర్ పై డా. లతారాజు నిర్మిస్తున్నారు.
తాజాగా "తక్షక" సినిమా పోస్టర్ ను స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన వినాయక్, మల్లిడి కుటుంబంతో తనకు ఎంతో అనుబంధం ఉందని చెప్పారు. చిన్నప్పటి నుంచి కృష్ణ మల్లిడి తనకు తెలిసిన వ్యక్తి అని, ఇప్పుడు దర్శకుడిగా మారడం ఆనందంగా ఉందన్నారు. కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చిన నిర్మాత డా.లతారాజుకు అభినందనలు తెలిపారు. అలాగే ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్న కుశాల్ రాజు మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.
నిర్మాత డా.లతారాజు మాట్లాడుతూ "తక్షక" సరికొత్త కథాంశంతో రూపొందుతున్న చిత్రమని చెప్పారు. మహాభారత కాలం నుంచి నేటి వరకు వేల ఏళ్ల ప్రయాణాన్ని ఆసక్తికరంగా చూపించే ప్రయత్నం చేశామని తెలిపారు. దర్శకుడు కృష్ణ మల్లిడి ప్రతి అంశంపై రీసెర్చ్ చేసి సినిమాను ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చేలా రూపొందిస్తున్నారని చెప్పారు. హీరో కుశాల్ రాజు కూడా ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడని వెల్లడించారు.
దర్శకుడు కృష్ణ మల్లిడి మాట్లాడుతూ, "తక్షక" సినిమా ప్రారంభం నుంచి వినాయక్ గారి ప్రోత్సాహం తమకు లభిస్తోందన్నారు. ప్రస్తుతం సీజీ వర్క్ జరుగుతోందని, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు ఒక గ్రాండ్ విజువల్ అనుభూతిని తీసుకురాబోతున్నామని తెలిపారు. సినిమా విజయంపై పూర్తి నమ్మకం ఉందన్నారు.
హీరో కుశాల్ రాజు మాట్లాడుతూ, సినిమా కోసం మొత్తం టీమ్ ఎంతో కష్టపడి పనిచేసిందని చెప్పారు. త్వరలోనే ట్రైలర్ విడుదల చేస్తామని వెల్లడించారు. దర్శకుడు కృష్ణ మల్లిడి విజన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
"తక్షక" చిత్రంలో పృథ్వీరాజ్, వైవా హర్ష, బబ్లూ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా, అమర్నాథ్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతోంది.

