Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎండలు పెరుగుతున్నాయ్.. ప్రెగ్నెంట్ మహిళలు ఈ విషయాలు అస్సలు మర్చిపోవద్దు!

ఎండలు పెరుగుతున్నాయ్.. ప్రెగ్నెంట్ మహిళలు ఈ విషయాలు అస్సలు మర్చిపోవద్దు!

రాష్ట్రవ్యాప్తంగా ఎండలు రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో సాధారణ ప్రజలే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

ముఖ్యంగా గర్భిణీలు మాత్రం ఈ కాలంలో ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక వేడి ప్రభావం వల్ల తల్లి ఆరోగ్యంతో పాటు గర్భంలోని శిశువుపైనా ప్రభావం పడే అవకాశం ఉందని చెబుతున్నారు.

గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో సహజంగానే ఉష్ణోగ్రతలు కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. రక్తప్రసరణ వేగంగా జరగడం, గుండె స్పందనలు పెరగడం వంటి మార్పుల కారణంగా శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. దీనికి తోడు ఎండ తీవ్రత పెరిగితే డీహైడ్రేషన్, తల తిరగడం, బీపీ సమస్యలు, హీట్ స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో గర్భిణీలు రోజంతా శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడం చాలా అవసరం. సాధ్యమైనంత వరకు ఎక్కువగా నీరు తాగడం, కొబ్బరి నీళ్లు, తాజా ఫ్రూట్ జ్యూసులు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలాగే దోసకాయ, పుచ్చకాయ, ముసంబి, నారింజ వంటి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.

ఎండ తీవ్రంగా ఉండే మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకపోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని, బయటకు వెళ్లేటప్పుడు కాటన్ దుస్తులు ధరించడం, తలపై స్కార్ఫ్ లేదా గొడుగు ఉపయోగించడం అవసరమని సూచిస్తున్నారు. అలాగే బిగుతుగా ఉండే దుస్తులకు బదులుగా గాలి ఆడేలా ఉండే లూజ్ ఫిట్టింగ్ డ్రెస్సులు ధరించడం శరీరానికి ఉపశమనం ఇస్తుందని అంటున్నారు.

ఆహార విషయంలో కూడా గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. మసాలా, ఆయిల్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తగ్గించడం మంచిదని చెబుతున్నారు. కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే చాలా చల్లటి నీరు తాగడం కూడా మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

రోజుకు కనీసం కొంత సమయం నడక చేయడం, గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల శరీరానికి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే తీవ్రమైన తలనొప్పి, వాంతులు, తల తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా బిడ్డ కదలికలు తగ్గినట్లు అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు.

వేసవిలో చిన్న నిర్లక్ష్యం కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున గర్భిణీలు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సరైన ఆహారం, తగిన విశ్రాంతి, శరీరానికి చల్లదనం కలిగించే అలవాట్లు పాటిస్తే హీట్‌వేవ్స్ ప్రభావాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చని చెబుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Desk