వేసవి కాలంలో బయట ఎండలో తిరిగి ఇంటికి చేరుకున్న వెంటనే చాలామంది చేసే మొదటి పని ఫ్రిజ్ నుంచి చల్లటి నీళ్లు తీసుకుని తాగడమే. క్షణాల్లో శరీరం చల్లబడినట్టుగా అనిపించినా, ఈ అలవాటు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా ఐస్ కోల్డ్ వాటర్‌ను తరచుగా తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెరిగి కడుపు సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
నిపుణుల ప్రకారం, శరీర ఉష్ణోగ్రతకు చాలా తక్కువగా ఉన్న నీటిని ఒక్కసారిగా తాగితే జీర్ణక్రియ మందగిస్తుంది. ఆహారం జీర్ణం కావడానికి అవసరమైన జీర్ణరసాల పనితీరు తగ్గిపోవడంతో గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కనిపించవచ్చు. అలాగే చల్లటి నీరు రక్తనాళాలను సంకోచింపజేసి జీర్ణవ్యవస్థకు రక్తప్రసరణను కూడా ప్రభావితం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.
అంతేకాదు, భోజనం చేసిన వెంటనే ఐస్ వాటర్ తాగడం వల్ల కొవ్వు పదార్థాలు సరిగా కరగక జీర్ణం ఆలస్యమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. దీని ప్రభావంతో మలబద్ధకం సమస్యలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. కొందరిలో గొంతు నొప్పి, జలుబు, టాన్సిల్స్ వంటి సమస్యలు కూడా ఎక్కువయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఆరోగ్య పరంగా చూస్తే ఫ్రిజ్‌లోని అతిగా చల్లటి నీటికి బదులుగా సాధారణ ఉష్ణోగ్రతలో ఉన్న నీరు లేదా మట్టి కుండలో నిల్వ చేసిన నీరు మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. కుండ నీరు సహజంగా చల్లగా ఉండటంతో పాటు శరీరానికి హాయిని ఇస్తుందని చెబుతున్నారు. వేసవిలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడం ఎంత ముఖ్యమో, నీటిని సరైన విధంగా తాగడం కూడా అంతే అవసరమని నిపుణులు గుర్తుచేస్తున్నారు.

