ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉంచినా బొద్దింకల సమస్య చాలామందిని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ముఖ్యంగా వంటగది, సింక్ దగ్గర, చెత్త బుట్టల చుట్టూ ఇవి ఎక్కువగా కనిపిస్తాయి.
ఆహార పదార్థాలపై తిరగడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే చాలామంది మార్కెట్‌లో దొరికే కెమికల్ స్ప్రేలను ఉపయోగిస్తుంటారు. అయితే వాటి వల్ల ఆరోగ్యంపై దుష్ప్రభావాలు ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లోనే సులభంగా దొరికే కొన్ని పదార్థాలతో బొద్దింకలను దూరం చేసుకోవచ్చని హోమ్ కేర్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా టమాటాతో చేసే ఒక సింపుల్ చిట్కా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ చిట్కా కోసం ఒక టమాటాను తీసుకుని మధ్యలో కోసి గుజ్జును కొద్దిగా తీసేయాలి. తర్వాత అందులో బేకింగ్ సోడా, పంచదార కలిపి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని బొద్దింకలు ఎక్కువగా తిరిగే ప్రదేశాల్లో ఉంచితే మంచి ఫలితం కనిపిస్తుందని చెబుతున్నారు. టమాటా, పంచదార వాసనకు ఆకర్షితులైన బొద్దింకలు ఈ మిశ్రమాన్ని తినడంతో వాటి సమస్య తగ్గుతుందని అంటున్నారు.
అంతేకాకుండా ఇంట్లో మరికొన్ని సహజ చిట్కాలు కూడా ఉపయోగపడతాయి. వంటగది అల్మారాల్లో లేదా డ్రాయర్లలో వేపాకు లేదా బిర్యానీ ఆకులు ఉంచితే వాటి వాసనకు బొద్దింకలు దూరంగా ఉంటాయని చెబుతున్నారు. అలాగే వేప నూనెను నీటిలో కలిపి స్ప్రే బాటిల్ ద్వారా కిచెన్ మూలల్లో చల్లినా ప్రయోజనం ఉంటుందని సూచిస్తున్నారు.
కర్పూరం కూడా బొద్దింకలను తరిమికొట్టడంలో సహాయపడుతుంది. బాత్రూమ్, కిచెన్ ప్రాంతాల్లో కర్పూరం బిళ్లలు ఉంచితే వాటి వాసనకు బొద్దింకలు దగ్గరకు రావని గృహిణులు చెబుతున్నారు. అదేవిధంగా నేల తుడిచే నీటిలో నిమ్మరసం, వెనిగర్ కలిపి ఉపయోగిస్తే ఇంట్లో పరిశుభ్రత పెరగడంతో పాటు చీమలు, బొద్దింకల సమస్య కూడా తగ్గే అవకాశం ఉంటుందని అంటున్నారు.
అయితే బొద్దింకల సమస్య పూర్తిగా తగ్గాలంటే ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆహార పదార్థాలను మూతపెట్టి ఉంచడం, చెత్తను ఎక్కువసేపు నిల్వ చేయకుండా వెంటనే బయటకు వేయడం వంటి అలవాట్లు పాటిస్తే ఈ సమస్యను చాలా వరకు నియంత్రించవచ్చు.

