నదులు భారతీయ సంస్కృతిలో కేవలం నీటి వనరులు మాత్రమే కాకుండా పవిత్రతకు ప్రతీకలుగా పరిగణించబడతాయి. గంగా, యమునా, గోదావరి, కృష్ణ వంటి నదులను మనం దేవతలుగా భావించి పూజించడం మన సంప్రదాయంలో భాగం.
ఒకప్పుడు జీవనాధారంగా ఉన్న ఈ నదులను పరిశుభ్రంగా ఉంచేందుకు పూర్వీకులు అనేక ఆచారాలను రూపొందించారు. వాటిలో నదిలో నాణేలు వేయడం కూడా ఒకటి.
ప్రయాణాల్లో లేదా పుణ్యక్షేత్రాల సందర్శనలో నదులు కనిపించినప్పుడు చాలామంది జేబులోని నాణెం నీటిలో వేయడం సాధారణంగా కనిపించే దృశ్యం. ఇది అదృష్టం కోసం లేదా మొక్కుబడిగా చేస్తారని చాలామంది భావిస్తారు. కానీ ఈ ఆచారం వెనుక ఒకప్పుడు శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయని చరిత్ర చెబుతోంది.
పూర్వకాలంలో ఉపయోగించిన నాణేలు ప్రధానంగా రాగితో తయారయ్యేవి. అప్పట్లో నీటిని శుద్ధి చేసే ఆధునిక పద్ధతులు లేవు. గ్రామాలు, పట్టణాలు నదుల నీటిపైనే ఆధారపడేవి. రాగికి సహజంగా బ్యాక్టీరియాను నిరోధించే గుణం ఉండటంతో, నీటిలో రాగి నాణేలు పడేయడం వల్ల కొంత మేర నీరు శుభ్రంగా ఉండేదని చెబుతారు. అందుకే ఈ ఆచారం ప్రాచుర్యంలోకి వచ్చింది.
రాగి శరీరానికి అవసరమైన ముఖ్య ఖనిజాల్లో ఒకటి కూడా. చిన్న పరిమాణంలో అది నీటిలో కలవడం ఆరోగ్యానికి సహాయపడుతుందనే నమ్మకం అప్పట్లో ఉండేది. ఈ కారణంతోనే నది దాటే సమయంలో లేదా పుణ్యకార్యాల్లో నాణెం వేయడం ఒక సంప్రదాయంగా మారింది.
అయితే కాలక్రమేణా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం వాడుతున్న నాణేలు ఎక్కువగా అల్యూమినియం లేదా స్టీల్‌తో తయారవుతున్నాయి. ఇవి నీటిలో పడేయడం వల్ల ఎలాంటి శుద్ధి ప్రయోజనం కలగదు. పైగా నదుల కలుషితానికి దోహదం చేసే అవకాశం ఉంది. అయినప్పటికీ ఈ ఆచారం చాలాచోట్ల అలవాటుగా కొనసాగుతోంది.
సంప్రదాయాల వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. నదులను పరిశుభ్రంగా ఉంచడం, వాటి ప్రాధాన్యాన్ని గుర్తించడం మాత్రమే నిజమైన గౌరవమని భావిస్తున్నారు. మూఢనమ్మకాలుగా మారిన ఆచారాల కంటే పర్యావరణ పరిరక్షణపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఇప్పుడు మరింత పెరిగింది.

