వైద్య రంగంలో పక్షవాతం (స్ట్రోక్) నివారణపై ఎప్పటికప్పుడు కొత్త చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్, దీపికా పదుకోన్ మాజీ పోషకాహార నిపుణురాలు శ్వేతా షా పంచుకున్న ఒక జపనీస్ పద్ధతి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ సులభమైన హోమ్ టెక్నిక్ పక్షవాతాన్ని తగ్గించడంలో సహాయపడుతుందనే ఆమె వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.
శ్వేతా షా చెప్పిన ప్రకారం, రోజూ గోరువెచ్చని నీటిలో పాదాలను 15 నుంచి 20 నిమిషాలు ఉంచడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుందని, ఒత్తిడి తగ్గుతుందని పేర్కొన్నారు. కొంతమంది ఎప్సమ్ సాల్ట్ కలిపితే నిద్ర కూడా బాగుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా 50 ఏళ్లు పైబడిన వారు ఈ అలవాటు పాటిస్తే ఆరోగ్యానికి ఉపయోగమని ఆమె సూచించారు.
అయితే వైద్య నిపుణులు ఈ అభిప్రాయంపై భిన్నంగా స్పందిస్తున్నారు. ముంబైలోని ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ పంకజ్ అగర్వాల్ ప్రకారం, గోరువెచ్చని నీటిలో పాదాలు ఉంచడం తాత్కాలిక ఉపశమనం ఇవ్వొచ్చే తప్ప పక్షవాతాన్ని నివారిస్తుందనే శాస్త్రీయ ఆధారాలు లేవని స్పష్టం చేశారు. స్ట్రోక్ ప్రధానంగా మెదడుకు రక్తప్రసరణ ఆగిపోవడం వల్ల వస్తుందని ఆయన తెలిపారు.
అధిక రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్, ధూమపానం వంటి అంశాలు స్ట్రోక్‌కు ప్రధాన కారణాలని వైద్యులు చెబుతున్నారు. అందువల్ల నియమిత ఆరోగ్య పరీక్షలు, సరైన ఆహారం, వ్యాయామం మరియు వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకోవడం మాత్రమే నిజమైన నివారణ మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.
కొన్ని సందర్భాల్లో ఈ హాట్ వాటర్ ఫుట్ బాత్ ఒత్తిడిని తగ్గించవచ్చని, రక్తప్రసరణ కొంత మెరుగుపడవచ్చని వైద్యులు అంగీకరిస్తున్నారు. కానీ ఇది చికిత్సకు ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేస్తున్నారు.
మధుమేహం, నరాల సమస్యలు లేదా గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు ఈ పద్ధతిని అనుసరించే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచనలు ఉన్నాయి. నీరు ఎక్కువ వేడిగా ఉంటే గాయాల ప్రమాదం ఉండవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మొత్తానికి, సోషల్ మీడియాలో వైరల్ అయ్యే హెల్త్ టిప్స్‌ను పూర్తిగా నమ్మకుండా, శాస్త్రీయ ఆధారాలతో కూడిన వైద్య సలహాలపై ఆధారపడటం మంచిదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

