తెలుగు సినీ పరిశ్రమలో మహిళా ప్రధాన పాత్రలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన నటీమణుల్లో విజయశాంతి పేరు ముందువరుసలో ఉంటుంది. సినిమాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె, రాజకీయాల్లోనూ చురుకుగా కొనసాగుతున్నారు.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, సహనటులతో ఉన్న అనుబంధం, వ్యక్తిగత అభిప్రాయాలపై విజయశాంతి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా పలువురు స్టార్ హీరోల గురించి చెప్పిన వ్యాఖ్యలు అభిమానుల్లో చర్చకు దారితీశాయి.
ఇంటర్వ్యూలో భాగంగా విజయశాంతి తనకు ఇష్టమైన నటీమణుల గురించి మాట్లాడుతూ, సావిత్రిని మహానటి అని అభివర్ణించారు. జయసుధ సహజమైన నటనకు ప్రతీక అని, జయప్రద ఎంతో మంచి మనసున్న వ్యక్తి అని అన్నారు. అలాగే శ్రీదేవిని అందమైన బొమ్మలా ఉండే నటి అంటూ ప్రశంసించారు. నటి రాధిక గురించి మాట్లాడుతూ, ఆమె ఎప్పుడూ సరదాగా ఉండి సెట్స్‌లో అందరినీ నవ్విస్తుందని గుర్తుచేశారు.
తాను ఎక్కువ సినిమాలు చేసిన హీరోల్లో చిరంజీవి ఒకరని విజయశాంతి తెలిపారు. ఆయనలో డ్యాన్స్‌తో పాటు అద్భుతమైన కామెడీ టైమింగ్ కూడా ఉంటుందని అన్నారు. నాగార్జున, వెంకటేష్‌లతో తక్కువ సినిమాలు చేసినప్పటికీ, వారిద్దరూ అద్భుతమైన నటులని కొనియాడారు. సెట్స్‌లో అందరితో కలిసిమెలిసి ఉండే స్వభావం చిరంజీవి ప్రత్యేకత అని పేర్కొన్నారు.
అయితే బాలకృష్ణతో ఉన్న అనుబంధం గురించి మాట్లాడినప్పుడు విజయశాంతి మరింత భావోద్వేగానికి లోనయ్యారు. 'భానుమతి గారి మొగుడు' సినిమా సమయంలో రాఖీ పండుగ రావడంతో బాలకృష్ణకు రాఖీ కట్టానని చెప్పారు. అప్పటి నుంచి ఆయనను సోదరుడిలా భావిస్తున్నానని వెల్లడించారు. ఏ విషయమైనా తనతో ఆప్యాయంగా మాట్లాడే వ్యక్తి బాలకృష్ణ అని ఆమె పేర్కొన్నారు. సెట్స్‌లో ఆయన చాలా సరదాగా ఉండేవారని కూడా గుర్తుచేశారు.
దివంగత నటుడు కృష్ణ గురించి మాట్లాడుతూ విజయశాంతి భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. తన సినీ ప్రయాణానికి తొలి అవకాశం ఇచ్చింది కృష్ణ గారేనని, ఆయన ఎంతో మంచివ్యక్తి అని అన్నారు. విజయనిర్మల దంపతుల పట్ల తనకు అపారమైన గౌరవం ఉందని తెలిపారు. ప్రస్తుతం వారిని ఎంతో మిస్ అవుతున్నానని కూడా చెప్పారు. మహేష్ బాబును మంచి మనసున్న వ్యక్తిగా అభివర్ణించిన విజయశాంతి, ఆయన సినిమాతోనే తాను మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడం ఆనందంగా అనిపించిందన్నారు.
సినిమాలతో పాటు ప్రజాసేవ కూడా తన జీవితంలో ముఖ్యమైన భాగమని విజయశాంతి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల కోసం పని చేయడం తన బాధ్యతగా భావిస్తున్నానని చెప్పారు. జీవితంలో పెద్దగా వ్యక్తిగత కోరికలు లేవని, ప్రజలు సంతోషంగా ఉండటమే తనకు ముఖ్యమని పేర్కొన్నారు. ప్రజల మధ్య ఉండి సేవ చేయడానికే తాను ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తానని విజయశాంతి తెలిపారు.

