భారతీయ ఇళ్లలో తరతరాలుగా పెంచుకుంటూ వస్తున్న తులసి మొక్కకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
చిన్న మొక్కగానే కనిపించినా, తులసిలో దాగి ఉన్న ఔషధ గుణాలు శరీరానికి సహజ రక్షణ కవచంలా పనిచేస్తాయని వైద్యులు పేర్కొంటున్నారు. అందుకే దీనిని ఆయుర్వేదంలో "మూలికల రాణి"గా అభివర్ణిస్తారు.
తులసి ఆకులు, గింజలు, పువ్వులు, కాండం వరకు ప్రతి భాగంలోనూ శరీరానికి మేలు చేసే గుణాలు ఉంటాయి. ముఖ్యంగా వేసవికాలంలో తులసి గింజలు శరీరానికి చల్లదనాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. నీటిలో నానబెట్టిన సబ్జా గింజలను శర్బత్ లేదా పానీయాల్లో కలిపి తీసుకుంటే శరీర ఉష్ణోగ్రత తగ్గడమే కాకుండా డీహైడ్రేషన్ సమస్య దూరమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
తులసిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. వాతావరణ మార్పుల సమయంలో వచ్చే జలుబు, దగ్గు, వైరల్ జ్వరాలు వంటి సమస్యల నుంచి రక్షణ కల్పించడంలో తులసి కీలకంగా పనిచేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. రోజూ కొన్ని తులసి ఆకులను తీసుకోవడం లేదా తులసి టీ తాగడం వల్ల శ్వాసకోశ ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇప్పటి జీవనశైలిలో ఒత్తిడి సాధారణ సమస్యగా మారుతోంది. ఈ పరిస్థితిలో తులసి మానసిక ప్రశాంతతకు కూడా తోడ్పడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తులసిలోని సహజ గుణాలు ఒత్తిడి హార్మోన్ల ప్రభావాన్ని తగ్గించి శరీరానికి ప్రశాంతతను అందిస్తాయని వివరించారు. అలాగే కడుపులో గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలను తగ్గించడంలో కూడా ఇది ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు.
రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ, గుండె ఆరోగ్యం పరిరక్షణలో కూడా తులసి ఉపయోగకరంగా ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే తులసిని అధికంగా ఉపయోగించకుండా పరిమిత మోతాదులోనే తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆకులను నేరుగా ఎక్కువగా నమలడం కంటే నీటిలో మరిగించి తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.
ఇంటి ముందున్న తులసి మొక్కను కేవలం పూజకే పరిమితం చేయకుండా దైనందిన జీవితంలో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సహజసిద్ధంగా అందుబాటులో ఉండే ఈ మూలిక అనేక సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ ఇవ్వడంలో ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నారు.

