Dailyhunt
వేసవిలో వేడి టీ తాగితే శరీరానికి చల్లవా. నిజం ఏంటో తెలుసుకోండి

వేసవిలో వేడి టీ తాగితే శరీరానికి చల్లవా. నిజం ఏంటో తెలుసుకోండి

వేసవిలో మండే ఎండల నుంచి ఉపశమనం పొందాలంటే చాలా మంది చల్లని పానీయాలవైపు మొగ్గు చూపుతారు. అయితే ఆశ్చర్యకరంగా, వేడి వేడి చాయ్ తాగడం కూడా శరీరానికి చల్లదనాన్ని కలిగించగలదని నిపుణులు చెబుతున్నారు.

వినడానికి విరుద్ధంగా అనిపించినా, దీనికి శాస్త్రీయ కారణం ఉందని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

వేడి పానీయాలు తీసుకున్నప్పుడు శరీర ఉష్ణోగ్రత కొద్దిగా పెరుగుతుంది. ఈ మార్పును గుర్తించిన మెదడు, శరీరాన్ని సమతుల్యం చేయడానికి చెమట ఉత్పత్తిని పెంచుతుంది. దీనివల్ల ఎక్కువగా చెమట పడుతుంది. ఆ చెమట చర్మంపై నుంచి ఆవిరైపోతూ, శరీరంలోని వేడిని బయటకు తీసుకెళ్తుంది. ఈ సహజ ప్రక్రియ వల్ల మనకు చల్లదనం అనిపిస్తుంది. ఈ ప్రభావాన్నే శాస్త్రవేత్తలు "థర్మోజెనిక్ ఎఫెక్ట్"గా పేర్కొంటున్నారు.

అంతేకాకుండా, చాయ్‌లో కలిపే అల్లం, యాలకులు వంటి పదార్థాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇవి శరీరంలో జీవక్రియలను చురుకుగా చేసి, వేసవిలో వచ్చే అలసటను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే చాయ్‌లో ఉండే కెఫీన్ తాత్కాలికంగా ఉత్సాహాన్ని పెంచుతుంది.

అయితే ఈ ప్రయోజనం ప్రతి పరిస్థితిలో పనిచేయదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గాలిలో తేమ (హ్యూమిడిటీ) ఎక్కువగా ఉన్నప్పుడు చెమట సరిగా ఆవిరి కాదు. అలాంటి పరిస్థితుల్లో వేడి చాయ్ తాగితే చల్లదనం కలగడం బదులు ఉక్కపోత మరింత పెరిగే అవకాశం ఉంది.

ఇంకా, రోజుకు అధికంగా చాయ్ తీసుకోవడం కూడా మంచిది కాదు. ముఖ్యంగా డీహైడ్రేషన్ సమస్య ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. నీటిని సరిపడా తీసుకోవడం కూడా చాలా ముఖ్యం.

మొత్తం మీద, పొడి వాతావరణంలో పరిమితంగా వేడి చాయ్ తాగడం శరీరాన్ని సహజంగా చల్లబరచడంలో సహాయపడుతుంది. అయితే పరిస్థితులను బట్టి, శరీర అవసరాలను గుర్తించి ఆహారపానీయాలను ఎంపిక చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Desk