అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపీ విలువ మళ్లీ రికార్డు స్థాయికి పడిపోయే దిశగా కదులుతోంది. 2026 జనవరిలో డాలర్‌కు సుమారు రూ.89 నుంచి రూ. 90 పరిధిలో ఉన్న రూపాయి, మార్చి, మే నాటికి రూ.
93- రూ. 96 మధ్య బలహీన స్థాయిలో ట్రేడ్ అవుతోంది. ఇది కేవలం భారత రూపాయి కథ కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలు డాలర్ ముందు వెనక్కి తగ్గుతున్నాయి.
అయితే 2013లో రూపాయి పతనం మన సొంత లోపాల కథ అయితే.. 2026లో ఇది ప్రధానంగా డాలర్ బలం- యుద్ధ భయానికి సంబంధించిన గాథగా చెప్పొచ్చు. డాలర్ ఇండెక్స్ బలపడితే ఏమవుతుంది? అని చూస్తే..
యుద్ధాలు, చమురు ధరలు, ఫెడ్ పాలసీ మూడు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. డాలర్ బలపడటం అంటే, మిగతా కరెన్సీలు బలహీనపడటంగా చెబుతారు. ప్రత్యేకించి చమురు దిగుమతులపై ఆధారపడే దేశాలవి. 2026 నాటికి అమెరికా డాలర్ ఇండెక్స్ ఎంతో బలంగా ఉంది.
ఎమర్జింగ్ మార్కెట్లపై డాలర్ ఒత్తిడిని కొలిచే సూచీలు కూడా 2024-26 మధ్య గరిష్ఠ స్థాయులకు చేరాయి. ఉక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతలు, రెడ్ సీ- గల్ఫ్ ప్రాంతాల్లో షిప్పింగ్ రిస్క్, ఇవన్నీకలిపి క్రూడ్ ఆయిల్ ధరలను పైపైకి వెళ్లేలా చేశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు ఎక్కువకాలం హైర్ ఫర్ లాంగర్ స్థాయిలోనే ఉంటాయనే అంచనాలు, గ్లోబల్ ఇన్వెస్టర్లను మళ్లీ డాలర్ వైపు లాగుతున్నాయి. డాలర్ బలపడటం అనేది, ప్రపంచం మొత్తం డాలర్‌లో సేఫ్టీ కోసం పరుగెత్తే సమయంలో మిగతా కరెన్సీలకు తప్పనిసరిగా ఎదురయ్యే ఒకానొక బలహీనతగా మారింది.
రూపాయి మాత్రమే కాదు.. మరెన్నో కరెన్సీలు పడిపోయాయి. 2026లో డాలర్ ముందు బలహీనపడిన 10 ప్రధాన కరెన్సీలు ఎలా ఉన్నాయో చూస్తే.. 2026 జనవరి నుంచి మే వరకు డాలర్‌తో పోలిస్తే గణనీయంగా బలహీనపడిన కరెన్సీలలో ఇరాన్ రియాల్..
సుమారు 14 నుంచి 15శాతానికి పడిపోగా, అర్జెంటీనా పెసో.. సుమారు 14శాతం డ్రాప్ అయ్యింది. నైజీరియన్ నైరా 13శాతానికి పైగా, టర్కిష్ లిరా 12శాతానికి పైగా పతనమయ్యాయి. అలాగే..
ఈజిప్షియన్ పౌండ్ 11నుంచి12 శాతం వరకూ, బ్రెజిలియన్ రియాల్ 9 శాతం, ఇండియన్ రుపీ 5 నుంచి 6శాతం వరకూ డ్రాప్ అయ్యాయి. ఇండోనేషియా- ఆరు శాతం, దక్షిణాఫ్రికా రాండ్ ఐదు నుంచి ఆరు శాతం, దక్షిణ కొరియా వోన్ కూడా 5నుంచి 6 శాతం వరకూ పడిపోయింది. దీని ద్వారా మనకు అర్ధమవుతున్నది ఏంటంటే.. రూపాయి ఒంటరిగా పడిపోవడం లేదు.
డాలర్ బలానికి ఎదురు నిలబడలేక అనేక దేశాల కరెన్సీలు కూడా ఇలాగే పడిపోతున్నాయని అర్ధం చేసుకోవాలి. 2013 వర్సెస్ 2026.. అప్పటి రూపాయి పతనం, ఇప్పటి రూపాయి పతనానికి ఉన్న తేడా ఏంటంటే.. 2013లో రూపాయి పతనం ప్రధానంగా మన సొంత లోపాలతో కూడుకున్నదైతే..
2026లో పతనం ప్రధానంగా ప్రపంచ దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్త వాతావరణానికి సంబంధించినదిగా అంచనా వేస్తారు. 2013 మే-ఆగస్టు మధ్య కాలంలో రూపాయి డాలర్‌తో పోలిస్తే దాదాపు 15 నుంచి 20శాతం వరకు కుప్పకూలింది. అప్పట్లో భారత్, బ్రెజిల్, ఇండోనేషియా, టర్కీ, దక్షిణాఫ్రికా.. ఈ ఐదు దేశాలను గ్లోబల్ ఇన్వెస్టర్లు ఫ్రాగిల్ ఫైవ్ గా పిలిచారు.
కారణం.. అధిక కరెంట్ అకౌంట్ లోటు, భారతదేశంలో 2012-13లో జీడీపీలో సుమారు 4.8శాతం వరకు వెళ్లింది. భారీ చమురు, బంగారం దిగుమతుల విషయానికి వస్తే.. ఎగుమతుల కంటే దిగుమతులు చాలా ఎక్కువ.
అధిక ద్రవ్యోల్బణం 10శాతానికి పైగా, మందగించిన వృద్ధి 5శాతం కంటే తక్కువగా ఉంది. 2013 మేలో ఫెడ్ ఛైర్మన్ బెన్ బెర్నాంకే, క్వాంటిటేటివ్ ఈజింగ్ బాండ్ల కొనుగోళ్లు తగ్గిస్తామని సంకేతం ఇచ్చిన వెంటనే, ఎమర్జింగ్ మార్కెట్ల నుంచి భారీగా డాలర్ పెట్టుబడులు బయటకు వెళ్లాయి. దీనినే టేపర్ టాంట్రమ్ అని పిలుస్తారు. 2013లో భారత విదేశీ మారక నిల్వలు సుమారు 275 బిలియన్ డాలర్ల పరిధిలోనే ఉండేవి.
కేవలం 6 నుంచి 7 నెలల దిగుమతులకు సరిపడే స్థాయి అన్న మాట ఇది. రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి ఆర్బీఐకి మార్కెట్లో డాలర్లు అమ్మే సామర్థ్యం తక్కువగా ఉండటంతో, రూపాయి మరింత బలహీనపడింది. 2013లో రూపాయి పతనం అధిక కరెంట్ అకౌంట్ లోటు, తక్కువ ఫారెక్స్, అధిక ద్రవ్యోల్బణం, టేపర్ టాంట్రమ్ గా మారాయి. ప్రస్తుతం రూపాయి ఎందుకు బలహీనపడుతోంది?
అని పరిశీలిస్తే.. గ్లోబల్ యుద్ధ వాతావరణం, బలమైన డాలర్, చమురు బిల్లు ప్రధాన కారణాలుగా కనిపిస్తాయి. ఇప్పటి రూపాయి బలహీనతకు సొంత సమస్యలు కావు, ప్రపం వ్యాప్తంగా ఉన్న ఉద్రిక్త వాతావరణం ప్రధానకారణం. 2026 నాటికి రూపాయి డాలర్‌తో పోలిస్తే రూ.
93 నుంచి రూ. 96 పరిధిలో ట్రేడ్ అవుతోంది. ఇది సంవత్సర ఆరంభంతో పోలిస్తే 5 నుంచి 6 శాతం బలహీన పడినట్టు లెక్క. భారత్ తన క్రూడ్ ఆయిల్ అవసరాల్లో 85 నుంచి 90శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది.
చమురు ధరలు పెరిగితే, డాలర్ల డిమాండ్ పెరుగుతుంది. రూపాయి బలహీనపడుతుంది. 2026 ప్రారంభంలో ఎమర్జింగ్ మార్కెట్ల నుంచి సుమారు 8 నుంచి10 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు ఉపసంహరించుకున్న అంచనాలున్నాయి. ఇది రూపాయి మీద బాగా ఒత్తిడిని పెంచింది.
అమెరికా వడ్డీ రేట్లు ఆకర్షణీయంగా ఉండటంతో.. గ్లోబల్ క్యాపిటల్ మళ్లీ డాలర్ కొనుగోళ్ల వైపు కదులుతోంది. 2013తో పోలిస్తే అతి పెద్ద తేడా ఏటంటే, బలమైన ఫారెక్స్ నిల్వలు. ప్రస్తుతం భారత విదేశీ మారక నిల్వలు 640 నుంచి 700 బిలియన్ డాలర్ల మధ్య ఉన్నాయి.
సుమారు 10 నుంచి 11 నెలల దిగుమతులకు సరిపడే స్థాయి అన్నమాట ఇది. రూపాయి ఒక్కసారిగా కుప్పకూలకుండా ఉండేందుకు ఆర్బీఐ మార్కెట్లో డాలర్లు అమ్ముతూ, స్మూత్ డిప్రిసియేషన్ విధానాన్ని అనుసరిస్తోంది. అందుకే 2013లా ఒక్కసారిగా 15 నుంచి 20 శాతం మేర పతనం కాకుండా, 4 నుంచి 6 శాతం వరకూ మాత్రమే బలహీనంగా కనిపిస్తోంది. ఇప్పటి రూపాయి పతనాన్ని..
క్రైసిస్ అనే కంటే కాస్ట్‌లీ అడ్జస్ట్మెంట్ గా చెప్పాలి. బలమైన డాలర్, చమురు బిల్లు, గ్లోబల్ యుద్ధ వాతావరణం ఇందుకు మెయిన్ రీజన్ గా భావించాలి. రూపాయి బలహీనమవుతోందంటే, దేశం బలహీనమవుతోందా? అన్న పరిశీలన చేస్తే..
నామమాత్రపు రేటు వర్సెస్ వాస్తవ బలం ఎలాంటిదో చూస్తే సరిపోతుంది. రూపాయి, డాలర్ రేటు ఒక్కటే దేశ బలం, బలహీనతకు కొలమానం కాదు. కానీ ఇదొక సంకేతం మాత్రమే. 2010లో డాలర్‌కు రూ.
45 ఉండగా, 2020లో రూ. 75, 2026లో రూ.93నుంచి రూ.96 గా ఉండటం అంటే, ఇది రూపాయి దీర్ఘకాలిక బలహీనతను ఎత్తి చూపుతుంది. సరిగ్గా అదే సమయంలో, భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం, ఎగుమతులు, ఫారెక్స్ నిల్వలు, డిజిటల్ ఎకానమీ గణనీయంగా పెరిగిన మాట వాస్తవం. రూపాయి బలహీనత వల్ల ఏం జరుగుతుందో చూస్తే..
చమురు, ఎలక్ట్రానిక్స్, ఎరువుల దిగుమతి భారం పెరుగుతుంది. ద్రవ్యోల్బణ ఒత్తిడి పెరుగుతుంది, కానీ ఎగుమతిదారులకు కొంత పోటీ ప్రయోజనం కూడా లభిస్తుంది. రూపాయి బలహీనపడింది అంటే దేశం కూలిపోతుందని కాదు.. కానీ దిగుమతి ఆధారిత ఆర్థిక వ్యవస్థకు ఇది ఒక హెచ్చరిక సంకేతం.
2013లో రూపాయి పతనం, భారత ఆర్థిక వ్యవస్థకు ఒక కఠిన పాఠం నేర్పింది. అధిక కరెంట్ అకౌంట్ లోటు, తక్కువ ఫారెక్స్ నిల్వలు, అధిక ద్రవ్యోల్బణం, బలహీన వృద్ధి కలిస్తే.. ఒక చిన్న ఫెడ్ ప్రకటన కూడా పెద్ద కరెన్సీ సంక్షోభంగా మారుతుంది. 2026లో పరిస్థితి ఇందుకు భిన్నమైనది.
గ్లోబల్ యుద్ధ వాతావరణం, చమురు ధరలు, బలమైన డాలర్ ఇవన్నీ కలిసి.. రూపాయిపై ఒత్తిడి పెంచుతున్నా, బలమైన ఫారెక్స్ నిల్వలు, మెరుగైన మాక్రో ఫండమెంటల్స్, RBI యాక్టివ్ ఇంటర్వెన్షన్ రూపాయి పతనాన్ని కంట్రోల్డ్ స్లోడౌన్ గా మార్చుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇప్పటి రూపాయి బలహీనత, మన ఆర్థిక వ్యవస్థ విఫలమైందనే సంకేతం కాదు.
ప్రపంచం మొత్తం డాలర్ వైపు పరుగెత్తుతున్న సమయంలో, మనం చమురు, డాలర్ ఆధారాన్ని ఎంత తగ్గించగలమన్నది అసలు పరీక్ష. -సీతారాం కంఠంనేని ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.

