Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
36 ఏళ్ల క్రితమే చావు అంచుకు వెళ్లొచ్చిన ప్రదీప్ రావత్‌

36 ఏళ్ల క్రితమే చావు అంచుకు వెళ్లొచ్చిన ప్రదీప్ రావత్‌

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా, పవర్‌ఫుల్ విలన్‌గా పేరు తెచ్చుకున్న ప్రదీప్‌సింగ్ రావత్‌(74) మంగళవారం సాయంత్రం కన్నుమూసిన విషయం తెలిసిందే.

గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న ఆయన, ముంబైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన అకాల మరణవార్త వినగానే టాలీవుడ్, బాలీవుడ్ సహా పలు సినీ పరిశ్రమల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. రావత్ కెరీర్ ప్రారంభంలో బి.ఆర్. చోప్రా ప్రతిష్టాత్మక టీవీ సీరియల్ 'మహాభారత్'లో అశ్వత్థామ పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఆ తర్వాత అమీర్ ఖాన్ నటించిన 'లగాన్'లో దేవా పాత్రతో మెప్పించిన ఆయన, ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'సై' చిత్రంలో భిక్షు యాదవ్‌గా టాలీవుడ్‌కి పరిచయమై సరికొత్త విలనిజానికి తెరతీశారు. క్రూరమైన కళ్లు, గంభీరమైన బాడీ లాంగ్వేజ్‌తో ఆయన పండించిన నెగెటివ్ షేడ్స్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో భయపెట్టాయి. ఆ పాత్రకు గాను ఆయన ఫిలింఫేర్ ఉత్తమ విలన్ అవార్డును కూడా గెలుచుకున్నారు.

అనంతరం 'ఛత్రపతి', 'దేశముదురు', 'జగడం', 'స్టాలిన్' వంటి అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో అగ్ర హీరోలకు సరిసమానమైన నటనను కనబరిచారు. సైనిక కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ప్రదీప్ రావత్, ప్రారంభంలో బ్యాంకింగ్ రంగంలో పనిచేసి నాటకాలపై ఉన్న ఆసక్తితో రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టారు. 36 ఏళ్ల క్రితం ఒక సినిమా షూటింగ్ సమయంలో సముద్రపు అలల మధ్య పడిపోయారు ప్రదీప్‌. ఎంతో కష్టం మీద ఆయన్ని బయటికి తీసుకొచ్చారు.

ఆయన ప్రాణాలతో ఉండే అవకాశం లేదని చిత్ర యూనిట్ కూడా భావించింది. అయితే అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారు. అది తనకు ఎంతో భయానక జ్ఞాపకం అని ప్రదీప్ చెప్పేవారు. చావు అంచుల వరకు వెళ్లి రావడం అనేది మామూలు విషయం కాదని, చిత్ర పరిశ్రమ, ప్రేక్షకుల ఆశీస్సుల వల్లే బ్రతికి బయపడ్డానని చెప్పేవారు.

ఆ తర్వాతి కాలంలో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ప్రదీప్ రావత్ మృతిపై టాలీవుడ్, బాలీవుడ్ నటీనటులు, దర్శకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. 'లగాన్' కొలీగ్ యశ్‌పాల్ శర్మతో పాటు పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు. "మా గజిని, దేవా ఇకలేరు" అంటూ ఫ్యాన్స్, నెటిజన్లు ఆయన పవర్ ఫుల్ డైలాగ్స్, సీన్స్ గుర్తు చేసుకుంటూ కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One