Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
9 రోజులు గడుస్తున్నా భగీరథ్ ఆచూకీ కనుక్కోలేదు..పోలీసులపై ఆర్‌ఎస్పీ ఫైర్

9 రోజులు గడుస్తున్నా భగీరథ్ ఆచూకీ కనుక్కోలేదు..పోలీసులపై ఆర్‌ఎస్పీ ఫైర్

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేగుతోంది. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ పరారీ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ కేసుపై బీఆర్‌ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అత్యంత సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సాయి భగీరథ్ ఎక్కడ తలదాచుకున్నాడనే నిజం కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్‌లకు మాత్రమే తెలుసంటూ ఆయన తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం, పోలీసులు అనుసరిస్తున్న వైఖరిపై ఆయన అనేక ప్రశ్నలను సంధించారు. ఘటన జరిగి తొమ్మిది రోజులు గడుస్తున్నా, ఇంతవరకు పోలీసులు బండి భగీరథ్‌ను ఎందుకు పట్టుకోలేకపోయారని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ నిలదీశారు.

సాధారణ ప్రజలు, విపక్ష నేతలు, జర్నలిస్టులపై చూపే ప్రతాపం అధికార, కేంద్ర మంత్రుల పిల్లలపై ఎందుకు చూపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీవీ రిపోర్టర్ దొంతు రమేష్, బీఆర్ఎస్ కార్యకర్త నల్లబాలు, పార్టీ నాయకుడు కృషాంక్, జర్నలిస్ట్ రేవతితో పాటు లగచర్ల రైతులను మాత్రం రాత్రికి రాత్రే అరెస్ట్ చేసిన పోలీసులు, ఈ కేసులో మాత్రం ఎందుకు కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. చట్టం అందరికీ ఒక్కటే అయినప్పుడు ఈ వివక్ష ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఇదే సమయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ వైఖరిని కూడా ఆయన తప్పుబట్టారు.

నిన్ననే కేంద్ర మంత్రి బండి సంజయ్ తన పేరును మీడియాలో ప్రస్తావించవద్దంటూ కోర్టు నుండి 'గ్యాగ్ ఆర్డర్' (Gag Order) తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఒక పక్క కేంద్ర మంత్రి అంతటి వాడే తన పేరు బయటకు రాకుండా చట్టపరమైన రక్షణ పొందుతుంటే, ఈ కేసులో బాధితురాలైన మైనర్ అమ్మాయి పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ చిన్న అమ్మాయి కోర్టుకు వెళ్లి గ్యాగ్ ఆర్డర్ ఎలా తెచ్చుకోగలదని ప్రశ్నించారు. బాధిత అమ్మాయి వైపు నిలబడి, ఆమెకు తల్లి లాగా అండగా ఉండి మంత్రి సీతక్క ఎందుకు గ్యాగ్ ఆర్డర్ తీసుకురావడానికి చొరవ చూపలేదని నిలదీశారు.

పోలీసుల తీరుపై కూడా ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టు ఆర్డర్ వస్తేనే మైనర్ బాలికపై సోషల్ మీడియాలో, వార్తల్లో వస్తున్న కథనాలను తొలగించగలమని పోలీసులు చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇలాంటి సున్నితమైన విషయాల్లో చొరవ తీసుకోకుండా కేవలం కోర్టు ఆదేశాల కోసం ఎదురుచూడటానికా మీకు జీతాలు ఇస్తున్నారంటూ పోలీసు వ్యవస్థపై ఫైర్ అయ్యారు. ప్రధానమంత్రి పర్యటన బందోబస్తులో పోలీసులు బిజీగా ఉన్నందు వల్లే నిందితుడిని పట్టుకోవడంలో ఆలస్యం అవుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్థించుకోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

ఈ ప్రధానమంత్రి బందోబస్తు కార్యక్రమంలో ఎక్కడా కూడా పేట్ బషీరాబాద్ ఏసీపీ, డీసీపీలు పాల్గొనలేదని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. బందోబస్తు విధుల్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10,000 మంది పోలీసులు పాల్గొంటే, మరి మిగిలిన వేలాది మంది పోలీసులు రాష్ట్రంలో ఏం చేస్తున్నారని నిలదీశారు. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి ఒక నిస్సహాయ ముఖ్యమంత్రిగా, నిస్సహాయ హోంమంత్రిగా మారిపోయారని ఎద్దేవా చేశారు. తన కొడుకును పోలీసులకు అప్పగించాల్సిందిగా ముఖ్యమంత్రే స్వయంగా బండి సంజయ్‌ను బతిమిలాడుకునే దౌర్భాగ్య స్థితికి ఈ ప్రభుత్వం దిగజారిపోయిందని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ రాజకీయ లొసుగుల మధ్య బాధితురాలికి న్యాయం జరుగుతుందా లేదా అన్నదే ఇప్పుడు మిగిలిన పెద్ద ప్రశ్న.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One