Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆ వ్యక్తి నన్ను నమ్మించి మోసం చేశాడు మూడేళ్లు నరకం చూశాను!

ఆ వ్యక్తి నన్ను నమ్మించి మోసం చేశాడు మూడేళ్లు నరకం చూశాను!

టాలీవుడ్‌లో తనదైన నటనతో, క్యూట్ లుక్స్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. నిరంతరం వైవిధ్యమైన సినిమాలతో బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ, తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంది.

ముఖ్యంగా తన లైఫ్‌లో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని గుర్తుచేసుకుని ఎమోషనల్ అయింది. తన కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి ముచ్చటించిన అనన్య.. గతంలో తాను ఎదుర్కొన్న బ్రేకప్ పెయిన్ గురించి మనసు విప్పి మాట్లాడింది. తాను ఒక వ్యక్తిని ఎంతగానో విశ్వసించానని, కానీ చివరకు అతడు నమ్మించి మోసం చేశాడని చెప్పుకొచ్చింది.

అది కేవలం ప్రేమ విఫలం కావడం కాదని, నమ్మకద్రోహమని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మోసం వల్ల దాదాపు మూడేళ్లపాటు తీవ్రమైన మానసిక నరకాన్ని అనుభవించానని అనన్య పేర్కొంది. ఉదయం లేచినప్పటి నుండి ఆ జ్ఞాపకాలే వేధించేవని, అయినప్పటికీ తన వృత్తిపరమైన బాధ్యతలను మాత్రం ఎప్పుడూ విస్మరించలేదని తెలిపింది. రాత్రంతా ఏడ్చినా, మరుసటి రోజు ఉదయాన్నే జిమ్‌కు వెళ్లేదాన్నని, షూటింగ్ సమయంలో క్యారవాన్‌లో ఒంటరిగా కూర్చొని వెక్కి వెక్కి ఏడ్చేదాన్నని కన్నీటిపర్యంతమైంది.

తన షాట్ రాగానే కళ్లు తుడుచుకుని కెమెరా ముందుకు వచ్చేదాన్నని వివరించింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన అనన్య, చిత్ర పరిశ్రమలోకి రాకముందు ప్రముఖ ఐటీ సంస్థ ఇన్‌ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసింది. నటనపై ఉన్న మక్కువతో లఘు చిత్రాలలో నటించి, ఆ తర్వాత 'మల్లేశం' సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఆపై పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్', 'ప్లే బ్యాక్', 'శాకుంతలం', 'పొట్టేల్', 'డార్లింగ్' వంటి చిత్రాలలో కీలక పాత్రలు పోషించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

సోషల్ మీడియాలో కేవలం అమ్మాయిల గురించే నెగిటివ్ మీమ్స్ వస్తుంటాయని, అబ్బాయిలే ఎక్కువగా కంటెంట్ క్రియేట్ చేయడం వల్ల వారి పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే సమాజానికి తెలుస్తోందని ఈ సందర్భంగా అనన్య అభిప్రాయపడింది. అమ్మాయిల మనోభావాలు, వారు అనుభవించే బాధలు బయటకు రావడం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం అనన్య నాగళ్ల చేసిన ఈ భావోద్వేగ వ్యాఖ్యలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు, ఆమె అభిమానులు ఆమెకు మద్దతుగా నిలుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కాగా, ప్రస్తుతం ఈ బ్యూటీ 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్'తో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులతో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One