Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అత్తాపూర్‌లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్ కలకలం

అత్తాపూర్‌లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్ కలకలం

హైదరాబాద్‌ అత్తాపూర్ ప్రాంతంలో మంగళవారం (మే 19) అర్ధరాత్రి యువతి కిడ్నాప్ ఘటన తీవ్ర కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు కారులో యువతిని బలవంతంగా ఎక్కించుకుని వెళ్లిపోయిన సంఘటన స్థానికంగా భయాందోళనలకు గురి చేసింది.

అర్ధరాత్రి సమయంలో అత్తాపూర్‌లోని జాయ్ ఆసుపత్రి వైపు ఒక యువతి పరుగులు తీసుకుంటూ వచ్చి.. న్ను కిడ్నాప్ చేస్తున్నారు రక్షించండి అంటూ ఆసుపత్రి రిసెప్షన్ వద్ద సహాయం కోరింది. వెంటనే ఆమె ఆసుపత్రి లోపలికి వెళ్లి బాత్రూంలో దాక్కుంది. అయితే కొద్ది నిమిషాల్లోనే ఇద్దరు గుర్తు తెలియని దుండగులు ఆమెను వెంబడిస్తూ ఆసుపత్రికి చేరుకున్నారు.

వారిని రిసెప్షనిస్ట్ మరియు అక్కడ ఉన్న పేషెంట్ల బంధువులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు.అడ్డుకున్న వారిని బెదిరిస్తూ దుండగులు బలవంతంగా లోపలికి ప్రవేశించారు. అందరూ చూస్తుండగానే బాత్రూంలో దాక్కున్న యువతిని బయటకు లాగి, బలవంతంగా ఆసుపత్రి నుంచి తీసుకెళ్లి బయట నిలిపిన కారులో ఎక్కించి పారిపోయారు. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.

అత్తాపూర్ నుంచి అరంఘర్ చౌరస్తా వరకు థార్ కారును చేజ్ చేసినప్పటికీ, దుండగులు పోలీసుల కళ్లు కప్పి పారిపోయారు. నెంబర్ ప్లేట్ లేని కారు కావడంతో వారి వివరాలు సేకరించడం పోలీసులకు కష్టంగా మారింది. సమాచారం అందుకున్న వెంటనే రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తన బృందంతో ఘటనాస్థలానికి చేరుకున్నారు. పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే 143వ పిల్లర్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు.

మూడు గంటల పాటు సాగిన దర్యాప్తులో అనేక సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు.బుధవారం (మే20) ఉదయం అత్తాపూర్ జాయ్ ఆసుపత్రి వద్దకు టాస్క్ ఫోర్స్ చేరుకుని మళ్లీ సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. యువతి వివరాలు, కిడ్నాపర్స్ గుర్తింపు కోసం ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయి.అసలు యువతి ఎవరు? అర్ధరాత్రి ఆసుపత్రికి ఎందుకు వచ్చింది? ఆమెను ఎక్కడి నుంచి వెంబడించారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అత్తాపూర్ నుంచి అరంఘర్ వరకు ఉన్న అన్ని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తూ పోలీసులు విచారణ కొన సాగిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One