Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బెంగాల్ సరిహద్దు భద్రతకు స్మార్ట్ వాల్.. సాంకేతికతే ఆయుధం

బెంగాల్ సరిహద్దు భద్రతకు స్మార్ట్ వాల్.. సాంకేతికతే ఆయుధం

ఇండియా అంతర్గత భద్రతలో పశ్చిమ బెంగాల్ సరిహద్దు అత్యంత కీలకమైనది. సుదీర్ఘమైన ఈ సరిహద్దు గుండా జరుగుతున్న అక్రమ వలసలు, స్మగ్లింగ్, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం ప్రస్తుతం దేశానికి పెద్ద సవాలుగా మారింది.

కేవలం ఇటుకలు, ఇనుప కంచెతో కూడిన పాత పద్ధతుల ద్వారా ఈ సమస్యను పరిష్కరించడం సాధ్యం కాదు. ఈ సమస్య పరిష్కారానికి అత్యాధునిక సాంకేతికతతో కూడిన స్మార్ట్ వాల్ వ్యవస్థే శరణ్యమంటున్నారు రక్షణ రంగ నిపుణులు. సరిహద్దు భద్రతను కేవలం భౌతిక అడ్డంకిగా కాకుండా.. సెన్సార్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన సమగ్ర రక్షణ వ్యవస్థగా మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పశ్చిమ బెంగాల్ సరిహద్దు మొత్తం 2,217 కిలోమీటర్ల పొడవు, ఇందులో దాదాపు 569 కిలోమీటర్ల మేర ఇంకా ఎటువంటి కంచె లేదు. ఈ ఖాళీ ప్రదేశాల్లో నదులు, చిత్తడి నేలలు, కఠినమైన భౌగోళిక పరిస్థితులు ఉండటం వల్ల అక్కడ సాధారణ కంచె నిర్మాణం సాధ్యం కాదు. ఈ ప్రాంతం నుంచే దేశంలోకి చొరబాట్లు జరుగుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం అవకాశం ఉన్న 456 కిలోమీటర్ల ప్రాంతంలో ఫెన్సింగ్ పూర్తి చేయడంతో పాటు..

మిగిలిన 113 కిలోమీటర్ల క్లిష్టమైన ప్రాంతాల్లో సాంకేతిక నిఘా పెంచడం ద్వారానే చొరబాట్లను అరికట్టడానికి వీలౌతుంది. దాదాపు ఇటువంటి సమస్య పరిష్కారం కోసం అమెరికా, మెక్సికో సరిహద్దులో అనుసరిస్తున్న వ్యూహాలను పరిశీలిస్తే.. కేవలం గోడలు కట్టడం వల్ల చొరబాట్లు ఆగవని స్పష్టమవుతోంది. అక్కడ స్టీల్ గోడలు ఉన్నప్పటికీ, వలసదారులు నిచ్చెనలు, సొరంగాలు, కటింగ్ మెషీన్ల ద్వారా వాటిని దాటుతున్నారు.

అందుకే ఇండియా కేవలం కంచెపైనే ఆధారపడకుండా 'డిటెక్ట్-డిలే-ఇంటర్సెప్ట్ అనే సూత్రంపై పనిచేసే స్మార్ట్ సిస్టమ్‌ను అభివృద్ధి చేయాలి. అంటే ముందుగా సెన్సార్ల ద్వారా చొరబాటును గుర్తించడం, కంచె ద్వారా వారిని ఆలస్యం చేయడం, ఆ తరువాత భద్రతా బలగాలు అక్కడికి చేరుకుని వారిని అడ్డుకోవడం. బెంగాల్‌లోని గంగా, తీస్తా వంటి నదీ పరివాహక ప్రాంతాలు, సుందర్బన్ అటవీ ప్రాంతాల్లో భద్రత కల్పించడం చాలా కష్టమైన పని. ఇక్కడ భూమి స్థిరంగా ఉండదు కాబట్టి శాశ్వత కట్టడాలు నిర్మించలేము.

ఇలాంటి చోట్ల వాటర్ బోర్న్ బారియర్లు, నీటిపై తేలే ఫ్లోటింగ్ సెన్సార్లు ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. అమెరికాలోని రియో గ్రాండే నది వద్ద ఉపయోగిస్తున్న సిలిండ్రికల్ ఫ్లోటింగ్ బ్లాక్స్ వంటి పరికరాలు మన ఇక్కడి సరిహద్దుల్లో కూడా ప్రభావమంతంగా పనిచేస్తాయి. ఇవి చొరబాటుదారులు నీటిలో ఈదుతూ, పడవల ద్వారా రాకుండా అడ్డుకుంటాయి. భవిష్యత్తులో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాటర్ వింగ్ ను మరింత బలోపేతం చేసి, డ్రోన్లు, థర్మల్ కెమెరాలను అనుసంధానించాలి.

ప్రతి కదలికను రియల్ టైమ్‌లో పర్యవేక్షించేలా ఒక ఇంటిగ్రేటెడ్ బోర్డర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేయడం అత్యవసరం. దీనివల్ల సరిహద్దు దళాలకు, ఇంటెలిజెన్స్ సంస్థలకు మధ్య సమాచార మార్పిడి వేగంగా జరుగుతుంది. కేవలం సాంకేతికత మాత్రమే కాకుండా.. సరిహద్దు గ్రామాల్లో నివసించే ప్రజల జీవనోపాధి దెబ్బతీయకుండా, పర్యావరణాన్ని కాపాడుతూ ఈ వ్యూహాలను అమలు చేయాలి.

సరిహద్దులో గ్రే జోన్లు అంటే అనధికారిక నివాసాలు ఏర్పడకుండా చూడటం కూడా భద్రతలో ఒక భాగమే. భూసేకరణ, సరిహద్దు ప్రజల పునరావాసం వంటి అంశాలను శాస్త్రీయంగా పరిష్కరించాలి. బంగ్లాదేశ్ సరిహద్దు రక్షణ దళాలతో సమన్వయం పెంచుకుంటూ, పరస్పర సహకారంతో చొరబాట్లను అరికట్టాలి. సరిహద్దు వెంబడి నివసించే రైతులు, మత్స్యకారుల హక్కులకు భంగం కలగకుండా భద్రతా చర్యలు ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది.

మొత్తంగా బెంగాల్ సరిహద్దు భద్రత అనేది కేవలం ఒక రాష్ట్ర సమస్య కాదు, ఇది దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశం. సాంకేతికత, మానవ వనరులు, దౌత్య సంబంధాల కలయికతో కూడిన ఈ స్మార్ట్ బోర్డర్ ప్రాజెక్టుపై పెట్టే పెట్టుబడి దేశ భవిష్యత్తుకు ఒక వ్యూహాత్మక ఆస్తిగా మారుతుంది. ఈ ఆధునిక నిఘా వ్యవస్థ అమల్లోకి వస్తే.. నదీ ప్రవాహంలా సాగుతున్న చొరబాట్లను నియంత్రించి, సరిహద్దును సురక్షితంగా ఉంచడం సాధ్యమవుతుంది.

-సీతారాం కంఠంనేని ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One