యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు సమాజంలోని పలు కీలక అంశాలపై నిర్మొహమాటంగా స్పందించడం ఆమె శైలి.
తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఒక ఎమోషనల్ వీడియో ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వీడియోలో అనసూయ మాట్లాడుతూ.. సమాజంలో మహిళలపై కొనసాగుతున్న కొన్ని పాతకాలపు సంప్రదాయాలను ప్రశ్నించారు. ముఖ్యంగా భర్త చనిపోయిన తర్వాత స్త్రీలు బొట్టు, గాజులు, గజ్జెలు వంటి అలంకారాలను ఎందుకు తీసేయాలో తనకు అర్థం కావడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
తన వ్యక్తిగత అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ.. "మూడేళ్ల క్రితం మా నాన్నగారు చనిపోయారు. అంతకుముందు మా అమ్మ బొట్టు, రంగు రంగుల గాజులు, గజ్జెలతో చాలా అందంగా ఉండేది. కానీ నాన్నగారి మరణం తర్వాత ఆ అలంకారాలన్నీ అమ్మకు దూరమయ్యాయి.
చిన్నప్పటి నుంచి మనకు బొట్టు, గాజులు, కాటుకను పరిచయం చేసేది అమ్మలే. పెళ్లికి ముందే ఇవన్నీ మన జీవితంలో భాగమవుతాయి. అలాంటప్పుడు వాటిని కేవలం పెళ్లి లేదా భర్తతోనే ఎందుకు ముడిపెట్టాలి?" అని అనసూయ ప్రశ్నించారు. అలంకారం అనేది ఒక మహిళ వ్యక్తిగత హక్కు అని అనసూయ స్పష్టం చేశారు.
బొట్టు పెట్టుకోవాలా లేదా, గాజులు వేసుకోవాలా అనేది ఆ మహిళ ఛాయిస్‌కే వదిలేయాలని, దీనిపై ఎవరి బలవంతం ఉండకూడదని తెలిపారు. తానేమీ ఏ ఆచారానికి వ్యతిరేకం కాదని, కేవలం ప్రతి మహిళకు స్వేచ్ఛగా జీవించే హక్కు ఉండాలన్నదే తన అభిప్రాయమని వివరించారు. అనసూయ చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్ల నుండి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. చాలామంది మహిళలు ఆమె ఆలోచనను స్వాగతిస్తూ మద్దతు తెలుపుతుండగా, కొందరు మాత్రం సాంప్రదాయాల ప్రాముఖ్యతపై చర్చలు మొదలుపెట్టారు.

