Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భోజ్ శాల ఇక సరస్వతీ ఆలయం.. మసీదు కమిటీకి ప్రత్యామ్నాయ భూమి!

భోజ్ శాల ఇక సరస్వతీ ఆలయం.. మసీదు కమిటీకి ప్రత్యామ్నాయ భూమి!

శాబ్దాలుగా నలుగుతున్న భోజ్ శాల, కమల్ మౌలా మసీదు వివాదానికి మధ్యప్రదేశ్ హైకోర్టు ఒక చారిత్రక తీర్పుతో తెరదించింది. మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలో ఉన్న ఈ వివాదాస్పద కట్టడాన్ని ఇకపై ఒక ఆలయంగానే పరిగణించాలని ఇండోర్ హైకోర్టు స్పష్టం చేసింది.

ఈ సముదాయంపై ఉన్న యాజమాన్య హక్కుల వివాదానికి ముగింపు పలుకుతూ.. అక్కడ ఇకపై కేవలం హిందూ మతపరమైన ప్రార్థనలకు మాత్రమే అనుమతి ఉంటుందని న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సమర్పించిన శాస్త్రీయ నివేదిక ఆధారంగా ఈ కీలక తీర్పు వెలువడింది. మసీదు భాగానికి సంబంధించి ప్రభుత్వానికి విన్నవించుకోవచ్చని, వారికి వేరొక చోట ప్రత్యామ్నాయ భూమిని కేటాయించే అవకాశం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.

ఈ చారిత్రక నిర్ణయంతో 2003 నుండి కొనసాగుతున్న వారంలో ఒక్కో రోజు ఒక్కో వర్గానికి' అనే తాత్కాలిక ఏర్పాటుకు రద్దయింది. గత 23 సంవత్సరాలుగా, భోజ్ శాల ఒక రక్షిత స్మారక చిహ్నంగా ఉంటూనే.. ఉభయ పక్షాల మధ్య రాజీ మార్గంలో కొనసాగుతూ వచ్చింది. ఇందులో భాగంగా మంగళవారం హిందువులకు పూజల కోసం సమయం కేటాయించేవారు.

శుక్రవారం ముస్లింలకు నమాజ్ ల కోసం సమయం కేటాయించేవారు. అయితే.. ఈ తాత్కాలిక పద్ధతి వల్ల తరచుగా ఉద్రిక్తతలు చోటుచేసుకునేవి. ముఖ్యంగా వసంత పంచమి పర్వదినం శుక్రవారం నాడు వచ్చినప్పుడు తీవ్రమైన శాంతిభద్రతల సమస్యలు తలెత్తేవి.

తాజా తీర్పుతో ఇకపై ఆ సముదాయం సంపూర్ణంగా ఆలయ పక్షానికే దక్కనుంది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికలోని శాస్త్రీయ ఆధారాలు, చారిత్రక వాస్తవాలు పరిశీలించిన తర్వాత.. ఈ కట్టడం ప్రాథమికంగా ఒక ఆలయమని న్యాయస్థానం నిర్ధారించింది. మత సామరస్యాన్ని కాపాడుతూనే, చారిత్రక సత్యాన్ని పునరుద్ధరించడం ఈ తీర్పు యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

వెలుగులోకి వచ్చిన చారిత్రక సత్యాలుఈ కేసులో అత్యంత కీలకం అయ్యాయి. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్, అధునాతన కార్బన్ డేటింగ్ పద్ధతులను ఉపయోగించి సర్వే చేసి వెలవరించిన నివేదికలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఈ సముదాయం లోపల పరమార రాజుల కాలం నాటి భారీ నిర్మాణ అవశేషాలు లభ్యమయ్యాయి. మొత్తం 106 స్తంభాలు, 82 ఉపస్తంభాలు స్పష్టమైన ఆలయ వాస్తు శైలిని కలిగి ఉన్నాయి.

అలాగే.. ఇక్కడ లభించిన సంస్కృత, ప్రాకృత శాసనాలు, అరబిక్, పర్షియన్ శాసనాల కంటే చాలా పురాతనమైనవని సర్వేలో తేలింది. ఇంకా.. ప్రస్తుతమున్న నిర్మాణంలో పాత ఆలయ భాగాలను, స్తంభాలను యధాతథంగా వినియోగించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి.

కొన్ని భాగాలు అత్యంత హడావిడిగా, నిర్మాణ నియమాలను పాటించకుండా నిర్మించినట్లు ఏఎస్ఐ తన రెండు వేల పేజీల నివేదికలో నివేదికలో పేర్కొంది. తవ్వకాల్లో దెబ్బతిన్న అనేక దేవతామూర్తుల విగ్రహాలు, హైందవ సాంప్రదాయ చెక్కడాలు కూడా బయటపడ్డాయని నివేదిక పేర్కొంది. భోజ్ శాల వివాదం వెనుక వెయ్యేళ్ల చరిత్ర దాగి ఉంది. దాని ప్రస్థానాన్ని ఒకసారి పరిశీలిస్తే..

హైకోర్టు తీర్పుపై ముస్లిం పక్షం సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తీర్పు కేవలం ఒక స్థలం గురించినది మాత్రమే కాకుండా.. భారతదేశంలోని చారిత్రక కట్టడాల పరిరక్షణ, వాటి మూలాలను వెలికితీయడంలో పురావస్తు ఆధారాలకు ఉన్న ప్రాముఖ్యతను మరోసారి చాటిచెప్పింది. శాస్త్రీయ ఆధారాలతో నిరూపించబడిన చారిత్రక సత్యాలను న్యాయస్థానం గౌరవించడం ద్వారా, భవిష్యత్తులో దేశంలోని ఇటువంటి ఇతర వివాదాలకు కూడా ఇది ఒక మార్గదర్శిగా నిలిచే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

-సీతారాం కంఠంనేని ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One