Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బీజేపీని దాటేసిన కాక్రోచ్ జనతా పార్టీ... గంటల్లోనే ఎక్స్ అకౌంట్ బ్లాక్!

బీజేపీని దాటేసిన కాక్రోచ్ జనతా పార్టీ... గంటల్లోనే ఎక్స్ అకౌంట్ బ్లాక్!

ఇంటర్నెట్ యుగంలో మీమ్స్ సృష్టించే సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. కేవలం వ్యంగ్యంతో, జోకులతో ప్రారంభమైన ఒక సోషల్ మీడియా ఉద్యమం.. దేశంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీకి గట్టి పోటీనిస్తుందని ఎవరూ ఊహించి ఉండరు.

అవును, గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా తెగ ట్రెండ్ అవుతున్న 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) లేదా బొద్దింక జనతా పార్టీ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. నిరుద్యోగం, నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీలు, గోడీ మీడియా వంటి సున్నితమైన అంశాలపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ యువతను విపరీతంగా ఆకట్టుకున్న ఈ పేజీ ఊహించని మైలురాయిని అందుకుంది. ఇన్ స్టాగ్రామ్‌లో అధికార భారతీయ జనతా పార్టీ (BJP) అధికారిక ఖాతాను ఫాలోవర్ల సంఖ్యలో అధిగమించి అందరినీ షాక్‌కు గురిచేసింది. కేవలం 5 రోజుల్లోనే ఈ వింత రాజకీయ కూటమి ఏకంగా 13 మిలియన్ల (కోటి 30 లక్షల) కంటే ఎక్కువ మంది ఫాలోవర్లను సంపాదించుకుని రికార్డు సృష్టించింది.

ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్‌లో బీజేపీ అధికారిక ఖాతాకు దాదాపు 8.7 మిలియన్ల ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు. ఇంతటి భారీ ప్రజాదరణ పొందిన కొన్ని గంటల వ్యవధిలోనే కాక్రోచ్ జనతా పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ పార్టీకి చెందిన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాను భారతదేశంలో బ్లాక్ చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక చట్టపరమైన డిమాండ్‌కు ప్రతిస్పందనగా ఈ అకౌంట్‌ను నిలిపివేసినట్లు ఎక్స్ సంస్థ స్పష్టం చేసింది.

ఈ ఆకస్మిక చర్యపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం మీమ్స్, కామెడీ మాత్రమే పోస్ట్ చేసే ఒక సోషల్ మీడియా ఖాతాపై ఇంతటి నిరంకుశ చర్యలు తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీని వెనుక ప్రభుత్వ హస్తం ఉందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామంపై స్పందించిన కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే, "మేము ముందే ఊహించినట్లుగానే భారతదేశంలో కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ ఖాతాను నిలిపివేశారు" అంటూ తన వ్యక్తిగత ఖాతాలో స్క్రీన్ షాట్‌ను షేర్ చేశారు.

భిన్నాభిప్రాయాలను తట్టుకోలేక, యువత నుంచి వస్తున్న మద్దతును చూసి భయపడే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ సరికొత్త డిజిటల్ ఉద్యమం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) సూర్యకాంత్ ఒక కోర్టు విచారణ సందర్భంగా నిరుద్యోగులను, ఆన్‌లైన్ కార్యకర్తలను 'బొద్దింకలు', 'పరాన్నజీవులు' అని సంబోధించారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై దేశంలోని యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ క్రమంలోనే బోస్టన్ యూనివర్శిటీ గ్రాడ్యుయేట్, పొలిటికల్ కమ్యూనికేషన్ స్ట్రాటజిస్ట్ అయిన అభిజీత్ దిప్కే మే 15, 16 తేదీల్లో వ్యంగ్యంగా ఈ 'కాక్రోచ్ జనతా పార్టీ'ని స్థాపించారు. "సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్, లేజీ" అనే నినాదంతో, నిరుద్యోగ యువత గొంతుకగా మారిన ఈ డిజిటల్ పార్టీ, కేవలం కొద్ది రోజుల్లోనే దేశంలో ఒక పెద్ద సంచలనంగా రూపాంతరం చెందింది. అకౌంట్ బ్లాక్ అయినప్పటికీ ఇన్ స్టాగ్రామ్‌లో దీని జోరు ఇంకా కొనసాగుతూనే ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One