Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దక్షిణాదిలో సరికొత్త ఫ్రెండ్లీ పాలిటిక్స్... తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడో?

దక్షిణాదిలో సరికొత్త ఫ్రెండ్లీ పాలిటిక్స్... తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడో?

విజయ్, సతీశన్ అడుగుజాడల్లో... వైరల్‌గా మారిన కేరళ సీఎం, మాజీ సీఎంల భేటీ.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఈ మార్పు సాధ్యమేనా.. భారతీయ రాజకీయాల్లో సాధారణంగా కనిపించే శత్రుత్వాలు, విభేదాలకు భిన్నంగా దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళలలో సరికొత్త 'ఫ్రెండ్లీ పాలిటిక్స్' ట్రెండ్ నడుస్తోంది.

ఎన్నికల సమరంలో ఎంతగా తలపడినా.. అధికారం దక్కిన తర్వాత అందరినీ కలుపుకొని ముందుకు సాగాలనే ఉన్నతమైన రాజకీయ సంస్కృతిని అక్కడి నేతలు ప్రదర్శిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించి, కేరళ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సతీశన్ తాజాగా తీసుకున్న నిర్ణయం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆయన స్వయంగా మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసానికి వెళ్లి, ఆయనను ఆత్మీయంగా కలుసుకున్నారు.

ఉభయ నేతలూ ఎంతో స్నేహపూర్వక వాతావరణంలో రాష్ట్ర ప్రయోజనాలపై చర్చించడం విశేషం. ఇదే తరహా అరుదైన దృశ్యం కొద్దిరోజుల క్రితం తమిళనాడులోనూ ఆవిష్కృతమైంది. తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన విజయ్.. పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్‌తో పాటు ప్రతిపక్షాలకు చెందిన పలువురు ప్రముఖ నేతలను స్వయంగా కలిసి మర్యాదపూర్వకంగా సంభాషించారు.

ఈ రెండు పరిణామాలు గెలిచామనే గర్వం కానీ, ఓడిపోయామనే నైరాశ్యం కానీ లేకుండా, ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో నేతలు ఎంత పరిణతితో వ్యవహరిస్తున్నారో నిరూపిస్తున్నాయి. ఎన్నికల వరకే రాజకీయం.. ఆ తర్వాత రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అనే సిద్ధాంతాన్ని వీరు తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు.

పొరుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్న ఈ సానుకూల పరిణామాలపై అటు రాజకీయ విశ్లేషకులతో పాటు ఇటు ప్రజల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ఇటువంటి ఆరోగ్యకరమైన వాతావరణం ప్రభుత్వాల పనితీరును మెరుగుపరచడానికి, ప్రజల్లో రాజకీయాల పట్ల సానుకూల దృక్పథాన్ని పెంపొందించడానికి ఎంతో దోహదపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ పరిణామాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాలపై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ముగిసిన తర్వాత కూడా పార్టీల మధ్య వైషమ్యాలు, వ్యక్తిగత విమర్శలు, ప్రతీకార రాజకీయాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమిళనాడు, కేరళ నేతల తరహాలోనే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు కూడా ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఆత్మీయంగా కలుసుకునే రోజులు ఎప్పుడు వస్తాయా అని సామాన్య ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. భవిష్యత్తులోనైనా తెలుగు నేలపై ఇటువంటి సంస్కృతి చిగురిస్తుందో లేదో వేచి చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One