ఢిల్లీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్ర యంలో కస్టమ్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో కోట్ల రూపాయలు విలువ చేసే విదేశీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి చేరుకున్న ఇద్దరు విదేశీయులు తమ లగేజ్ బ్యాగుల్లో గంజాయిని అత్యంత గుట్టుగా తరలించే ప్రయత్నం చేశారు. గంజా యిని చిన్న చిన్న ప్యాకెట్లలో ప్యాక్ చేసి, వాటిని వ్యాక్యూమ్ సీల్ చేసి కస్టమ్స్ తనిఖీల్లో అనుమానం రాకుండా ప్లాన్ చేశారు. అయితే స్కానింగ్ సమయంలో అధికారులకు అనుమానం రావడంతో బ్యాగులను పూర్తిగా తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది. ఒక్కొక్క ప్యాకెట్ బ్యాగులలో నుండి బయట పడుతూ ఉండడం తో అధికారులు విస్తుపోయారు.
తనిఖీల్లో మొత్తం 49 కిలోల విదేశీ గంజాయి బయటపడగా, దాని విలువ అంతర్జాతీయ మార్కెట్ రూ.48 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ కేసులో ఇద్దరు థాయిలాండ్ జాతీయులను అరెస్ట్ చేసిన కస్టమ్స్ అధికారులు, వారి వద్ద నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.ఈ ఘటనపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ స్మగ్లింగ్ వెనుక అంతర్జాతీయ డ్రగ్స్ నెట్‌వర్క్ ఉందా అనే కోణంలో కూడా అధికారులు విచారణ చేపట్టారు.

