Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏలూరు జిల్లాలో రిలయన్స్ లక్ష కోట్ల రూపాయల ఇన్వెస్ట్ మెంట్.!

ఏలూరు జిల్లాలో రిలయన్స్ లక్ష కోట్ల రూపాయల ఇన్వెస్ట్ మెంట్.!

ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏపీలో భారీ ప్రాజెక్టు ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఏలూరు జిల్లా పరిధిలోని బొగ్గు గనులను వేదికగా చేసుకుని, అధునాతన సాంకేతికతతో కూడిన భూగర్భ కోల్ గ్యాసిఫికేషన్ (యూసీజీ) ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.

ఇందుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ మొదలైంది కూడా, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసంరి లయన్స్.లక్ష కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ఈ వేలంలో ఏలూరు జిల్లా పరిధిలోని బొగ్గు గనుల బ్లాకులను రిలయన్స్ దక్కించుకోవడంతో ఇంకే మాత్రం జాగు లేకుండా ఈ బిగ్ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఇటీవల నిర్వహించిన వేలంలో ఏలూరు జిల్లా చింతలపూడి, రేచెర్ల బొగ్గు గనులను రిలయన్స్ గ్రూప్ దక్కించుకుంది. ఈ గనుల్లో దాగి ఉన్న బొగ్గు నిక్షేపాలను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి సాంప్రదాయ మైనింగ్ పద్ధతులకు స్వస్తి చెప్పి, భూగర్భంలోనే బొగ్గును వాయువుగా మార్చే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని నిర్ణయించారు.

ఈ దిశగా ఇప్పటికే రిలయన్స్ ప్రతినిధుల బృందం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో సమావేశమై ప్రాజెక్టు సమగ్ర వివరాలు, క్షేత్రస్థాయి అమలు కార్యాచరణ ప్రణాళికను వివరించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఈ ప్రాజెక్టుకు అవసరమైన పూర్తి సహకారం అందిస్తామన్న హామీ లభించింది. చింతలపూడి, రేచెర్ల ప్రాంతాల్లో ఉన్న బొగ్గు గనులు భౌగోళికంగా ప్రాముఖ్యత కలిగినవి. చింతలపూడి బ్లాక్ దాదాపు 1,200 హెక్టార్ల వైశాల్యంలో విస్తరించి ఉండగా, అక్కడ జీ-12' రకానికి చెందిన 904.94 మిలియన్ టన్నుల బొగ్గు ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా, సమీపంలోనే ఉన్న రేచెర్ల బ్లాక్ 2,225 హెక్టార్ల పరిధిలో వ్యాపించి, అందులో జీ-13 రకానికి చెందిన 2,225.67 మిలియన్ టన్నుల నిక్షేపాలు ఉన్నట్లు ప్రాథమిక అంచనా. ఈ రెండు ప్రాజెక్ట్ పరిధిలోని గనుల్లో మొత్తం 30.61 మిలియన్ టన్నుల భారీ బొగ్గు నిల్వలు నిక్షిప్తమై ఉన్నాయి. సాధారణంగా భూమి ఉపరితలం నుంచి 600 మీటర్ల కంటే ఎక్కువ లోతులో ఉండే బొగ్గును సాంప్రదాయ ఓపెన్ కాస్ట్ లేదా అండర్‌గ్రౌండ్ మైనింగ్ ద్వారా వెలికితీయడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.

సాంకేతిక సమస్యలు, రవాణా భారం, భారీ వ్యయం కారణాల వల్ల ఇటువంటి లోతైన నిక్షేపాలను సద్వినియోగం చేసుకోవడం క్లిష్టంగా మారుతుంది. దీనికి పరిష్కారంగా రిలయన్స్ సంస్థ 'భూగర్భ కోల్ గ్యాసిఫికేషన్' సాంకేతికతను ఎంచుకుంది. ఈ పద్ధతిలో బొగ్గును బయటకు తవ్వకుండా, భూమి లోపలే నియంత్రిత ఉష్ణోగ్రతల వద్ద మండించి 'సింథటిక్ గ్యాస్' (సిన్‌గ్యాస్) గా మారుస్తారు. అనంతరం ఈ వాయువును ఉపరితలానికి రప్పించి, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా వినియోగిస్తారు.

ఈ గ్యాసిఫికేషన్ ప్రక్రియ ద్వారా వెలికితీసే సింథటిక్ సహజ వాయువు నుంచి మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉన్న అమ్మోనియం నైట్రేట్, అమ్మోనియా, సీఎన్‌జీ వంటి కీలక రసాయనాలు, ఇంధనాలను తయారు చేయడానికి అవకాశాలు లభిస్తాయి. దేశీయంగా ఈ తరహా భూగర్భ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు ఏర్పాటు కావడం ఇదే తొలిసారి కావడంతో పారిశ్రామిక వర్గాల్లోనూ, సాంకేతిక నిపుణుల్లోనూ తీవ్ర ఆసక్తి వ్యక్తమవుతోంది. ఈ మల్టీ-ఫేజ్ ప్రాజెక్టును మౌలిక వసతుల కల్పనతో పాటు దశలవారీగా నిర్మించి, 2029 నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని రిలయన్స్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ ప్రాజెక్టు సాకారమైతే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల ఆర్థిక స్థితిగతుల్లో విప్లవాత్మక మార్పులు రానున్నాయి.

ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్లాంట్ నిర్మాణ దశ నుంచి నిర్వహణ దశ వరకు ఇంజనీరింగ్, మైనింగ్, కెమికల్ , రవాణా రంగాల్లో భారీగా ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి. దీనివల్ల స్థానిక వ్యాపారాలు పుంజుకోవడంతో పాటు ప్రాంతీయ మౌలిక సదుపాయాలూ వేగంగా అభివృద్ధి చెందుతాయి. పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన విధానాలను అవలంబిస్తున్న ఏపీ ప్రభుత్వం, ఈ వినూత్న ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేసేందుకు సింగిల్ విండో అనుమతులు, అవసరమైన భూకేటాయింపులు మరియు ఇతర సౌకర్యాలను సత్వరమే కల్పించడానికి సుముఖంగా ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్లు, సాంకేతిక పరిశ్రమల స్థాపనకు ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపుతున్న తరుణంలో, రిలయన్స్ సంస్థ నుంచి అందుతున్న ఈ భారీ పెట్టుబడి రాష్ట్రాన్ని పారిశ్రామికంగా సరికొత్త ఎత్తులకు తీసుకెళ్తుందని పరిశీలకులు అంటున్నారు. Reliance to invest one lakh crore in Eluru district, Reliance Coal Gasification Project AP, Reliance Investment in Andhra Pradesh, Eluru Chintalapudi Coal Mines

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One