రాజకీయ నేతలను టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు కొత్త దారులు వెతుకుతున్నారు. తాజాగా ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్ బేగ్‌ను టార్గెట్ చేసిన గుర్తుతెలియని వ్యక్తులు డబ్బులు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు దిగారు.
అడిగినంత డబ్బు ఇవ్వకపోతే డీప్‌ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలను బయటపెడతామంటూ హెచ్చరించడం కలకలం రేపింది. తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఎమ్మెల్సీకి సంబంధించిన డీప్‌ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ చేసిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో, ఇతర వేదికల్లో బయటపెడతామని దుండగులు హెచ్చరించినట్లు తెలిసింది. అంతేకాకుండా కుటుంబ పరువుకు భంగం కలిగించడంతో పాటు రాజకీయంగా ఇబ్బందులు ఎదురయ్యేలా చేస్తామని బెదిరించారు. డబ్బులు ఇవ్వాలంటూ పదేపదే ఫోన్ కాల్స్ రావడంతో ఆందోళనకు గురైన ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్ బేగ్ పోలీసులను ఆశ్రయించారు.
తనకు వచ్చిన బెదిరింపు కాల్స్, డబ్బులు డిమాండ్ చేసిన విషయాలను పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్సీ ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బెదిరింపు కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? వాటి వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు?
డబ్బుల కోసం ఉద్దేశపూర్వకంగా బెదిరింపులకు పాల్పడ్డారా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.కాల్ చేసిన వ్యక్తుల ఫోన్ నంబర్లు, కాల్ వివరాలు, ఇతర డిజిటల్ ఆధారాలను సేకరించి నిందితులను గుర్తించే పనిలో సైబర్ క్రైమ్ పోలీసులు నిమగ్నమయ్యారు. .డీప్‌ఫేక్ టెక్నాలజీని అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడిన ఈ ఘటన.. సైబర్ నేరగాళ్లు రాజకీయ ప్రముఖులను సైతం ఎలా టార్గెట్ చేస్తున్నారనే అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది. MLC Mirza Rehmat Baig receives deepfake threats, MIM MLC, Cybercrime police, Deepfake technology, CM Revanth reddy, CP Sajjanar, DGP C.V. Anand

