Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీలో పర్యాటకుల భద్రతకు  టూరిస్ట్ పోలీస్!

ఏపీలో పర్యాటకుల భద్రతకు టూరిస్ట్ పోలీస్!

ఆంధ్రప్రదేశ్ ను పర్యాటక రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలిపే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే పర్యాటకుల రక్షణే పరమావధిగా రాష్ట్రంలో సరికొత్త టూరిజం సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్ పాలసీ ని అమలు చేయాలని పర్యాటక శాఖ అధికారులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు.

రాష్ట్రానికి వచ్చే దేశీయ, అంతర్జాతీయ పర్యాటకుల్లో ఆంధ్రప్రదేశ్ పర్యటకం అత్యంత సురక్షితం అనే బలమైన విశ్వాసం పాదుకునేలా చేయడమే ఈ విధానం ముఖ్య ఉద్దేశమన్న పవన్ కల్యాణ్.. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందాలంటే.. ఉపాధి అవకాశాలు మెరుగవ్వాలన్నా శాంతిభద్రతల పరిరక్షణ, పర్యాటకుల భద్రతే తొలి అజెండా కావాలన్నారు. ముఖ్యంగా పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక బిహేవియర్ కోడ్ ఆఫ్ కండక్ట్..

అంటే పర్యాటకులతో మర్యాదగా ప్రవర్తించేలా ఒక ప్రవర్తనా నియమావళిని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పర్యాటక ప్రాంతాలకు వచ్చే కుటుంబాలు, ముఖ్యంగా మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలనీ, మహిళా పర్యాటకులు ఎక్కడా అసౌకర్యానికి, వేధింపులకు గురికాకుండా కఠిన నిఘా ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై, పర్యాటకులను ఇబ్బంది పెట్టే శక్తులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. హోటళ్లు, ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు, గైడ్లు మరియు పర్యాటక సంబంధిత సేవలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, టూరిస్ట్ పోలీసుల వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు.

ఏపీకి ఉన్న 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతాన్ని పర్యాటక పరంగా గరిష్టంగా వినియోగించుకోవాలని అధికారులకు సూచించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఈ తీరప్రాంతాన్ని సమర్థంగా వాడుకుంటూ అడ్వెంచర్ టూరిజం, అంతర్జాతీయ స్థాయి బోట్ రేసులు, వాటర్ స్పోర్ట్స్ వంటి వినూత్న కార్యక్రమాలకు విస్తృత అవకాశాలు కల్పించబోతున్నట్లు చెప్పారు. అలాగే కొండ ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో యువతను ఆకట్టుకునేలా ట్రెక్కింగ్, మౌంటెనీరింగ్ వంటి సాహస క్రీడలను ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. పర్యాటకులు వేగంగా, సురక్షితంగా ప్రయాణించేందుకు వీలుగా ప్రముఖ టూరిజం హాట్‌స్పాట్లలో హెలీపోర్టుల అభివృద్ధికి తగిన ప్రణాళికలు రూపొందించి, నిర్ణీత వ్యవధిలో వాటిని పూర్తి చేయాలన్నారు. పర్యాటక రంగాన్ని కేవలం వినోదంగానే కాకుండా సంస్కృతి, ప్రకృతి పరిరక్షణకు వేదికగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తున్నదన్న ఆయన..

ఎకో టూరిజం ప్రాంతాలలో పర్యావరణానికి, ప్రకృతి సంపదకు ఎటువంటి హాని కలగకుండా, కఠినమైన లా అండ్ ఆర్డర్ నియంత్రణలో అభివృద్ధి పనులు జరగాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పార్వతీపురం మన్యం వంటి అపారమైన ప్రకృతి సంపద ఉన్న ప్రాంతాల వారసత్వ సంపదగా పరిరక్షిస్తూ, తద్వారా స్థానిక గిరిజనులకు, యువతకు ఉపాధి అవకాశాలు పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే తరహా విశిష్టమైన ఆర్కిటెక్చర్‌తో ఏపీ గుఐడెంటిటీ స్పష్టంగా కనిపించేలా పర్యాటక నిర్మాణ శైలి ఉండాలన్నారు. వీటితో పాటు ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి సాహితీ సర్క్యూట్, స్పిరిట్యువల్ సర్క్యూట్‌ల సమగ్ర అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One