Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గ్రీన్ కార్డ్ హోల్డర్లపై  డీపోర్టేషన్  నీడలు!

గ్రీన్ కార్డ్ హోల్డర్లపై డీపోర్టేషన్ నీడలు!

మెరికాలో శాశ్వత నివాస హోదా సంపాదించి.. అక్కడే స్థిరపడిన వలసదారులకు ప్రస్తుత పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. సాధారణంగా దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారిపైనే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని అంతా భావిస్తారు.

కానీ ప్రస్తుత ట్రంప్ యంత్రాంగం చట్టబద్ధంగా గ్రీన్ కార్డ్ పొంది నివసిస్తున్న వారిపై కూడా నిఘా పెంచడం గమనార్హం. నివాస అనుమతులు పొందిన వారి గత చరిత్రను, దరఖాస్తులను తిరిగి క్షుణ్ణంగా పరిశీలించేందుకు అత్యంత రహస్యంగా ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు అంతర్గత ప్రభుత్వ నివేదికల ద్వారా వెల్లడైంది. ఈ నూతన విధానం వల్ల వేలాది మంది చట్టబద్ధ వలసదారుల భవిష్యత్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం పరిధిలోని టాక్టికల్ ఆపరేషన్స్ డివిజన్ ఆధ్వర్యంలో ఈ సరికొత్త విభాగాన్ని తీసుకువచ్చారు.

ఇందులో ప్రధానంగా చట్టబద్ధ శాశ్వత నివాసితుల హోదా రద్దు (ఎల్పీఆర్ ఆపరేషన్స్), పౌరసత్వ ఉపసంహరణ (డీనాచురలైజేషన్), అలాగే శరణార్థుల రికార్డుల పునఃపరిశీలన (రెఫ్యూజీ రీవెట్టింగ్) వంటి విభాగాలు సంయుక్తంగా పనిచేస్తున్నాయి. వలస నిపుణుల అంతర్గత సంభాషణల ప్రకారం, దీనిని 'ఎల్పీఆర్ రిమూవల్ మెకానిజంగా పిలుస్తున్నారు. ఈ ప్రత్యేక విధి నిర్వహణ కోసం దాదాపు 40 మంది ఇమ్మిగ్రేషన్ అధికారులను కేటాయించారు. వీరు పూర్తిస్థాయిలో గ్రీన్ కార్డ్ గ్రహీతల పాత దస్త్రాలను, వారి నేర చరిత్రను నిశితంగా పరిశీలిస్తున్నారు.

ఇప్పటివరకు జరిగిన స్క్రీనింగ్ గణాంకాలను పరిశీలిస్తే, దాదాపు 2,890 మంది చట్టబద్ధ నివాసితుల పత్రాలను అధికారులు పరిశీలించారు. వారిలో 80 శాతం మందికి ఎటువంటి ఇబ్బందులు లేవని తేలింది. అయితే మిగిలిన వారిలో దాదాపు 500 మందికి పైగా వలసదారులు ఇంకా అధికారుల నిఘా పరిధిలోనే కొనసాగుతున్నారు. వీరిలో ప్రాథమికంగా 50 మందిని దేశం నుండి పంపించివేయడానికి అవసరమైన చట్టపరమైన చర్యలను అధికారులు అప్పుడే ప్రారంభించారు.

రానున్న రోజుల్లో ఈ పునఃపరిశీలన పరిధిని మరింత విస్తృతం చేసి, దేశవ్యాప్తంగా పదివేల మందికి పైగా గ్రీన్ కార్డ్ హోల్డర్ల రికార్డులను తనిఖీ చేయాలని అధికారులు యోచిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో వలసదారుల గుర్తింపు ప్రక్రియలో నిబంధనలను సడలించారని, అందువల్లే ఇప్పుడు ఈ తరహా కఠిన తనిఖీలు చేపట్టాల్సి వస్తోందని ట్రంప్ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దేశ పౌరుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడమే తమ ప్రధాన లక్ష్యమని ఇమ్మిగ్రేషన్ తాధికారులు సమర్థించుకుంటున్నారు. ఈ ప్రత్యేక నిఘా నీడలోకి ప్రధానంగా రెండు వర్గాల వారు వస్తున్నారు.

మొదటిది, గతంలో గృహ హింస, లైంగిక వేధింపులు, డ్రగ్స్ సరఫరా, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో న్యాయస్థానాల ద్వారా శిక్ష అనుభవించిన వారు. అలాగే అంతర్జాతీయంగా నిషేధిత సంస్థలకు లేదా నిఘా నీడలో ఉన్న విదేశీ విభాగాలకు ఎగుమతి నియంత్రణలు ఉన్న సాంకేతిక సమాచారాన్ని చేరవేసినట్లు అనుమానాలు ఉన్నవారు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఇక రెండవ విభాగంలో, గ్రీన్ కార్డ్ పొందే ప్రక్రియలో దరఖాస్తు ఫారమ్‌లలో తప్పుడు సమాచారం అందించిన వారు ఉన్నారు. నిజాలను దాచిపెట్టి, నకిలీ పత్రాలు లేదా అబద్ధాలతో శాశ్వత నివాస హోదా పొందినట్లు రుజువైతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

అయితే.. ఈ తనిఖీల్లో తప్పులు తేలిన వెంటనే ఎవరినీ నేరుగా దేశం నుండి పంపించివేయరని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. బాధితులకు ఇమ్మిగ్రేషన్ కోర్టులలో న్యాయమూర్తి ఎదుట తమ పక్షాన వాదనలు వినిపించేందుకు, పూర్తిస్థాయిలో తమ నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకునేందుకు చట్టబద్ధమైన అవకాశం ఉంటుంది. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ దూకుడు నిర్ణయాలపై గతంలో వివిధ పరిపాలనా కాలాల్లో పనిచేసిన మాజీ వలస విధాన అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

పెద్ద ఎత్తున నిధులు, సిబ్బందిని వాడుకుని తనిఖీలు చేసినప్పటికీ, కేవలం 2 శాతం మంది మాత్రమే దేశ బహిష్కరణకు గురయ్యే అవకాశం ఉన్నప్పుడు.. ఇంతటి మానవ వనరులను దీనికోసం వృధా చేయడం సరైన చర్య కాదని అంటున్నారు. ప్రస్తుతం ఇమ్మిగ్రేషన్ విభాగంలో రకరకాల వలస ప్రయోజనాలు, వీసాల కోసం దాదాపు 11 మిలియన్లకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో పేరుకుపోయాయి. ఈ పెండింగ్ దరఖాస్తుల సంఖ్య గత కొన్ని ఏళ్లతో పోలిస్తే రెట్టింపు కావడం గమనార్హం.

ఇంత భారీ స్థాయిలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉండి, సాధారణ వలసదారులు వీసాల కోసం ఏళ్ల తరబడి వేచి చూస్తున్న తరుణంలో, ఏజెన్సీ తన వనరులను ఇలాంటి ఏరివేత చర్యలకు ఉపయోగించడం బాధ్యతాయుతమైన చర్యకాదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో అత్యవసరమైన వలస సంస్కరణలు, దరఖాస్తుల వేగవంతమైన పరిష్కారంపై దృష్టి పెట్టాల్సింది పోయి, పాత రికార్డులను తవ్వడం వల్ల వ్యవస్థపై అదనపు భారం పడుతుందని మాజీ పాలసీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో సాధారణంగా గ్రీన్ కార్డ్ హోల్డర్లు అమెరికా పౌరసత్వం (సిటిజన్‌షిప్) కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో మాత్రమే వారి పాత నేర చరిత్రను లేదా రికార్డులను అధికారులు పరిశీలించేవారు. కానీ ప్రస్తుత యంత్రాంగం ఏకంగా ఒక ప్రత్యేక విభాగాన్ని రంగంలోకి దించి, చురుగ్గా పాత ఫైళ్లను వెలికితీయడం వలస సమాజంలో మునుపెన్నడూ లేని విధంగా అభద్రతా భావాన్ని పెంచుతోంది.

చట్టబద్ధంగా నివసిస్తున్న శరణార్థులు, శాశ్వత నివాసితులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ఈ కఠిన చర్యలు, దశాబ్దాలుగా అమెరికాను నమ్ముకుని చట్టప్రకారం స్థిరపడిన వారి భవిష్యత్తును సైతం ప్రశ్నార్థకంలో పడేస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ విధానం మరిన్ని వివాదాలకు దారితీసే అవకాశం కనిపిస్తోంది. -సీతారాం కంఠంనేని ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One