Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గ్రీన్ కార్డ్ కలలపై  తిరోగమన  నీడలు

గ్రీన్ కార్డ్ కలలపై తిరోగమన నీడలు

మెరికాలో శాశ్వత నివాసం ఏర్పరుచుకోవాలనే లక్ష్యంతో ఉన్న వేలాది మంది భారతీయ వృత్తి నిపుణులకు ఆ దేశ విదేశాంగ శాఖ గట్టి షాక్ ఇచ్చింది. తాజాగా విడుదలైన జూన్ 2026 వీసా బులెటిన్ ఇండియన్ దరఖాస్తుదారుల పాలిట ఆశనిపాతంగా మారింది.

ముఖ్యంగా ఉపాధి ఆధారిత వీసా కేటగిరీలలో ప్రకటించిన భారీ రిట్రోగ్రెషన్ అంటే తిరోగమనం కారణంగా.. గ్రీన్ కార్డ్ కోసం ఏళ్ల తరబడి వేచి చూస్తున్న వారి ప్రాధాన్యత తేదీలు ఒక్కసారిగా వెనక్కి వెళ్లాయి. ఈ పరిణామం కేవలం సాంకేతిక మార్పు మాత్రమే కాదనీ.. అమెరికాలో స్థిరపడాలనుకుంటున్న వేలాది కుటుంబాల భవిష్యత్తును అగమ్యగోచరంలోకి నెట్టివేస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

అమెరికా విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం, వార్షిక వీసా పరిమితులను మించకుండా ఉండేందుకు వీలుగా ఫైనల్ యాక్షన్ డేట్స్ ను వెనక్కి తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులు ఉండే ఈబీ1 కేటగిరీలో ప్రాధాన్యత తేదీ మూడున్నర నెలల మేర వెనక్కి జరిగి డిసెంబర్ 15, 2022 వద్ద నిలిచింది. ఇక ఉన్నత విద్యావంతులు దరఖాస్తు చేసుకునే ఈబీ 2 కేటగరీలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ కేటగిరీలో తేదీలు ఏకంగా 10 నెలలకు పైగా వెనక్కి జరిగి సెప్టెంబర్ 1, 2013కి చేరడం భారతీయ టెక్కీలను ఆందోళనకు గురి చేస్తోంది.

మరోవైపు, నైపుణ్యం కలిగిన కార్మికుల కేటగిరీ ఈబీ 3 ఎటువంటి పురోగతి లేకుండా డిసెంబర్ 15, 2013 వద్దే స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం అమెరికా ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్ నిరీక్షణ జాబితాలో సుమారు పది లక్షల మందికి పైగా భారతీయులు చిక్కుకుపోయారు. ప్రస్తుతం వీసా జారీ ప్రక్రియ సాగుతున్న వేగాన్ని బట్టి చూస్తే.. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి లేదా వెనకబడిన తేదీలు ఉన్న వారికి శాశ్వత నివాస హోదా లభించడానికి దశాబ్దాల కాలం పట్టే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టాల్లోని 'ఒక్కో దేశానికి 7 శాతం' అనే పాత నిబంధనే ఈ సమస్యకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. భారత్ వంటి అత్యధిక జనాభా, అలాగే ప్రతిభావంతులు ఉన్న దేశాల నుంచి వచ్చే దరఖాస్తులకు కూడా ఇదే పరిమితి వర్తించడం వల్ల డిమాండ్‌కు సరిపడా వీసాలు అందడం లేదు. ఈ జాప్యం భారతీయ కుటుంబాల జీవన ప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా హెచ్-1బీ వీసాలపై ఉన్న వారు తమ కెరీర్‌లో పురోగతి సాధించాలన్నా, మెరుగైన అవకాశాల కోసం కంపెనీలు మారాలన్నా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

గ్రీన్ కార్డ్ ప్రక్రియ మధ్యలో ఉండటంతో ప్రమోషన్లు తీసుకోవడానికి లేదా యజమానిని మార్చడానికి వీలు పడక వారి వృత్తిపరమైన ఎదుగుదల కుంటుపడుతోంది. కేవలం కెరీర్ మాత్రమే కాకుండా, ఆర్థికపరమైన నిర్ణయాల్లోనూ అనిశ్చితి నెలకొంది. శాశ్వత నివాస హోదా ఎప్పుడు వస్తుందో తెలియని తరుణంలో, అక్కడ ఇల్లు కొనడం లేదా కొత్త వ్యాపారాలు ప్రారంభించడం వంటి దీర్ఘకాలిక పెట్టుబడులకు భారతీయులు వెనుకంజ వేస్తున్నారు. అన్నిటికంటే ఆందోళనకరమైన విషయం ఏజింగ్ అవుట్ సమస్య.

గ్రీన్ కార్డ్ కోసం వేచి చూసే సమయం 20 నుండి 30 ఏళ్లకు చేరుతుండటంతో, తమపై ఆధారపడి అమెరికాకు వచ్చిన పిల్లలు 21 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత 'డిపెండెంట్' హోదాను కోల్పోతున్నారు. దీనివల్ల వారు లీగల్ డ్రీమర్స్ గా మారి, గ్రీన్ కార్డ్ రాకముందే చట్టబద్ధంగా ఆ దేశాన్ని విడిచి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఇది ఎన్నో కుటుంబాలను విచ్ఛిన్నం చేసే ప్రమాదం ఉందని మానవీయ కోణంలో విమర్శలు వస్తున్నాయి. సెప్టెంబర్ 30తో ముగిసే అమెరికా ఆర్థిక సంవత్సరం లోపు వీసాల కోసం డిమాండ్ ఇలాగే ఉంటే, రాబోయే నెలల్లో మరిన్ని తిరోగమనాలు ఉండవచ్చని విదేశాంగ శాఖ హెచ్చరించడం నిపుణులను మరింత కలవరపెడుతోంది.

అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో భారతీయ నిపుణులు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, వారిని శాశ్వతంగా నిలుపుకోవడంలో అక్కడి వలస విధానాలు అడ్డంకిగా మారుతున్నాయని ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు వాదిస్తున్నారు. దశాబ్దాల నిరీక్షణ తర్వాత కూడా గ్రీన్ కార్డ్ అందకపోవడం అనేది భారతీయ ప్రతిభావంతులకు ఆశనిపాతమే. -సీతారాం కంఠంనేని ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One