సిగరెట్ కోసం బయటకు వెళ్లిన వ్యక్తి.. తెల్లారేసరికి శవమై కనిపించాడు..! ఒక్క చిన్న సెల్‌ఫోన్ కోసం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నారు ఇద్దరు దుండగులు.
కాసేపట్లో తిరిగి వస్తానని భార్యకు చెప్పి సిగరెట్ కోసం బయటకు వెళ్లిన భర్త.. ఇక తిరిగి రాలేదు. భర్త కోసం ఎదురుచూసిన ఆ భార్యకు చివరకు ఊహించని విషాదం ఎదురైంది. హైదరాబాద్ అత్తాపూర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
నేపాల్‌కు చెందిన నాగేంద్ర మాఝీ అత్తాపూర్‌లో భార్య చంద్రతో కలిసి నివసిస్తున్నాడు. ఈ నెల 24న రాత్రి 11 గంటల సమయంలో సిగరెట్ తాగి వస్తానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. సాధారణంగానే వెళ్లిన భర్త.. కాసేపట్లో తిరిగి వస్తాడని భార్య భావించింది.
కానీ సమయం గడుస్తున్నా నాగేంద్ర ఇంటికి చేరుకోలేదు. ఆందోళన చెందిన చంద్ర భర్తకు ఫోన్ చేసింది. అయితే ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో ఆమెలో భయం మొదలైంది. అర్ధరాత్రి దాటినా భర్త జాడ లేకపోవడంతో చివరకు అతడి కోసం బయటకు వెళ్లి వెతకడం ప్రారంభించింది.
జనచైతన్య కాలనీలోని నిర్మాణంలో ఉన్న ప్రణవ విల్లాస్ సమీపంలో రోడ్డుపై నాగేంద్ర విగతజీవిగా కనిపించాడు. నుదుటిపై గాయంతో పడి ఉన్న భర్తను చూసిన చంద్ర గుండెలవిసేలా రోదించింది. కొద్దిసేపటి క్రితం తనతో మాట్లాడి బయటకు వెళ్లిన వ్యక్తి.. ఇలా శవమై కనిపించడంతో ఆమె కన్నీటి పర్యంతమైంది.
నాగేంద్ర వద్ద సెల్‌ఫోన్ కూడా కనిపించకపోవడంతో హత్యపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. వెంటనే ఆమె పోలీసులకు సమాచారం అందించింది. రాజేంద్రనగర్ పోలీసులు, శంషాబాద్ టాస్క్‌ఫోర్స్ రంగంలోకి దిగారు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు.
టెక్నికల్ ఆధారాలను విశ్లేషిస్తూ నిందితుల కోసం గాలించారు. చివరకు మహ్మద్ సూఫియాన్ సోహైల్ ఫరాష్ (21), మరో 17 ఏళ్ల బాలుడు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం.. నాగేంద్రపై దాడి చేసిన నిందితులు అతడి సెల్‌ఫోన్‌ను లాక్కొని హోండా యాక్టివాపై అక్కడి నుంచి పరారయ్యారు.
కేవలం ఓ ఫోన్ కోసం చేసిన దాడి.. చివరకు ఓ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి నాగేంద్ర సెల్‌ఫోన్, హోండా యాక్టివాను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు.
కొన్ని నిమిషాల కోసం బయటకు వెళ్లిన నాగేంద్ర.. తిరిగి వస్తాడని ఎదురుచూసిన భార్యకు మాత్రం కన్నీళ్లనే మిగిల్చాడు. చేతిలో ఉండాల్సిన సెల్‌ఫోన్ దుండగుల చేతికి వెళ్లింది.. కానీ దాని కోసం ఓ కుటుంబం మాత్రం జీవితాంతం భరించాల్సిన విషాదాన్ని మూటగట్టుకుంది. Attapur Murder, Hyderabad Crime, Mobile Phone Murder, Nagendra Majhi, Rajendranagar Police, Shamshabad Task Force, Murder Case, Cell Phone Theft, Crime News, Hyderabad Murder, Telgugu News, Telugu One

