తిరుమల గిరులు హరితశోభతో అలరారుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన చర్యలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.
ఇటీవల వెలువడిన ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ (ఐఎస్ఎఫ్ఆర్) నివేదిక మేరకు అటవీ సంరక్షణ చర్యల్లో టీటీడీ దేశంలోనే ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం శేషాచల అటవీ ప్రాంతంలో పచ్చదనం 89.40 శాతానికి చేరుకుంది. టీటీడీ అధీనంలోని మొత్తం 2,719 హెక్టార్ల అటవీ భూముల్లో ప్రస్తుతం 2,431 హెక్టార్లు ఆకుపచ్చటి అందంతో విలసిల్లుతున్నాయి. 1980 నుంచే ప్రత్యేక అటవీ విభాగాన్ని ఏర్పాటు చేసుకున్న టీటీడీ..
పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో రాజీలేని కృషి చేస్తోంది. డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (డీసీఎఫ్) నేతృత్వంలో తిరుమల, తిరుపతి ప్రాంతాల్లో విస్తరించి ఉన్న నాలుగు ఫారెస్ట్ రేంజ్‌లు ఈ అటవీ సంపదను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. శేషాచల కొండల్లో అక్రమ కలప తరలింపు, స్మగ్లింగ్, వన్యప్రాణుల వేటను అరికట్టడానికి అటవీ శాఖ కఠినమైన చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం 24 గంటల పాటు నిరంతరం గస్తీ కాసే ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను రంగంలోకి దించింది.
అదేవిధంగా.. వేసవి కాలంలో అడవుల్లో సంభవించే కార్చిచ్చులను నివారించేందుకు ఏటా దాదాపు 26.5 లక్షల చదరపు మీటర్ల మేర ఫైర్ లైన్లు ఏర్పాటు చేసి అగ్నిప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నది. జీవ వైవిధ్యాన్ని కాపాడటంలో భాగంగా టీటీడీ పర్యావరణానికి ప్రతికూలంగా మారిన విదేశీ జాతికి చెందిన అకేషియా వృక్షాలను పూర్తిగా తొలగిస్తూ.. వాటి స్థానంలో 576 హెక్టార్లలో శ్రీగంధం, ఎర్రచందనం, ఉసిరి, నేరేడు వంటి సంప్రదాయ స్థానిక మొక్కలను నాటే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.
ఇప్పటికే 22 హెక్టార్లలో ఈ పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఇందుకోసం టీటీడీ సొంత నర్సరీల ద్వారా నాణ్యమైన మొక్కలను ఉత్పత్తి చేస్తోంది. కేవలం వృక్ష సంపదనే కాకుండా, వన్యప్రాణుల రక్షణకు, మానవ, వన్యమృగాల ఘర్షణలను నివారించడానికి టీటీడీ ప్రత్యేక ప్రణాళికలను అమలు చేస్తోంది. వేసవి తీవ్రతకు అడవి జంతువులు నీటి కోసం మైదాన ప్రాంతాలకు రాకుండా ఉండేందుకు వీలుగా అటవీ అంతర్భాగాల్లో కృత్రిమ నీటి గుంతలను ఏర్పాటు చేసింది.
భక్తుల భద్రత దృష్ట్యా స్నేక్ రెస్క్యూ టీమ్‌లను సదా అందుబాటులో ఉంచింది. శ్రీవారి ఆలయ కైంకర్యాలకు అవసరమయ్యే శ్రీగంధం, పూజా ద్రవ్యాలు, వంటచెరకు మరియు దర్భలను కూడా ఈ విభాగమే సమకూరుస్తోంది. రాబోయే రోజుల్లో పవిత్ర వనం, దివ్య ఔషధ వనం వంటి ప్రాజెక్టుల ద్వారా శేషాచల అడవులను మరింత సుందరంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దేందుకు సిద్ధమౌతోంది.

