Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హిట్‌ అండ్‌ రన్‌లో ఒకరి మృతి.. ప్రముఖ ఆర్ట్‌ డైరెక్టర్‌ కుమారుడు అరెస్ట్‌..?

హిట్‌ అండ్‌ రన్‌లో ఒకరి మృతి.. ప్రముఖ ఆర్ట్‌ డైరెక్టర్‌ కుమారుడు అరెస్ట్‌..?

హైదరాబాద్‌ రాయదుర్గం పరిధిలో జరిగిన హిట్‌ అండ్‌ రన్‌ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కేసులో ప్రముఖ ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనంద్‌ సాయి కుమారుడు సందీప్‌ను రాయదుర్గం పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఓఆర్‌ఆర్‌ రోటరీ నుంచి ఖాజాగూడ గ్రామం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై నందులాల్‌ అనే వ్యక్తిని ఓ ఇన్నోవా కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో నందులాల్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న విద్యార్థి జైద్‌షా కద్రీ ప్రమాదాన్ని గమనించి మానవతా దృక్పథంతో స్పందించాడు. గాయపడిన నందులాల్‌ను ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించాడు.

అయితే నందులాల్‌ను ఆసుపత్రికి తీసుకెళ్తున్న సమయంలో మరో కారు వేగంగా వచ్చి వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నందులాల్‌ అక్కడికక్కడే మృతి చెందగా.. జైద్‌షా కద్రీ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు స్పందించి అతడిని ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం జైద్‌షా కద్రీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదం అనంతరం మహీంద్రా కారు ఆపకుండా వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు వాహనాన్ని గుర్తించి వెంబడించి పట్టుకున్నారు. కారు నడిపిన సందీప్‌ను అదుపులోకి తీసుకుని అరెస్ట్‌ చేశారు.

ఈ ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, వాహనం వేగం, ప్రమాదం జరిగిన సమయంలో చోటుచేసుకున్న పరిణామాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఒకరి ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నించిన విద్యార్థి.. చివరకు అదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడటం ఈ ఘటనను మరింత విషాదకరంగా మార్చింది. నందులాల్‌ మృతితో అతడి కుటుంబంలో విషాదం నెలకొనగా.. జైద్‌షా కద్రీ త్వరగా కోలుకోవాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు. Hyderabad, Rayadurgam, Hit and Run, Road Accident, Road Accident Death, Nandulal, Zaid Shah Qadri, Sandeep Anand Sai, Anand Sai Son Arrested, Mahindra Car, Innova Car, Khajaguda, ORR Rotary, Rayadurgam Police, Hit and Run Case, Art Director Anand Sai

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One