మొన్న కియా మోటార్స్, నిన్న పుట్టపర్తిలో ఫైటర్ జెట్స్ పరిశ్రమ, ఇవాళ చూస్తే రాయల్ ఎన్ఫీల్డ్ తయారీ.. సీమ రూపు మారిపోతోందా? ఇండస్ట్రియల్ హబ్‌గా రాయలసీమ.
మారనున్న రూపు రేఖలు ఎలాంటివి? ఒకప్పుడు రాయలసీమ అంటే ఎడారి లాంటి భూములు, ముఠా కక్షలు అనుకునే నెగెటివ్ మైండ్‌సెట్‌ని బద్దలు కొడుతూ... వరుసగా వస్తున్న భారీ ఇండస్ట్రీస్ సీమ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయి. మొన్న కియా మోటార్స్ సృష్టించిన సంచలనం, నిన్న శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో డిఫెన్స్/ఫైటర్ జెట్స్ ఏవియేషనన్ కమ్ ఏరో స్పేస్ రంగానికి సంబంధించిన భారీ పరిశ్రమల ఏర్పాటు ప్రకటనలు, ఇవాళ రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి దిగ్గజ బ్రాండ్ల రాక...
ఇవన్నీ చూస్తుంటే రాయలసీమ కేవలం ఇండస్ట్రియల్ హబ్ మాత్రమే కాదు, సౌత్ ఇండియాలోనే మోస్ట్ పవర్‌ఫుల్ ఎకనామిక్ కారిడార్‌గా అవతరిస్తోందని స్పష్టంగా అర్థమవుతోంది. చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్- CBIC అడ్వాంటేజ్ ఒకటి కలిసొచ్చే అంశంగా మారింది. రాయలసీమలోని ప్రధాన జిల్లాలైన చిత్తూరు, తిరుపతి, అనంతపురం, కడప... బెంగళూరు, చెన్నై వంటి రెండు మెట్రో నగరాలకు చాలా దగ్గరగా ఉంటాయి.
ఈ కారిడార్ విస్తరణ వల్ల.. కేవలం కార్లు, బైకులే కాదు.. వాటికి కావలసిన స్పేర్ పార్ట్స్ తయారు చేసే వందలాది చిన్న, మధ్యతరగతి పరిశ్రమలైన- MSMEs సీమ అంతటా విస్తరిస్తున్నాయి. దీనివల్ల లోకల్ గా ఉండే చిన్న వ్యాపారస్తులకు కూడా భారీగా లాభాలు వస్తాయి.
ఇక పోతే ఏరోస్పేస్ కమ్ డిఫెన్స్ హబ్‌గా పుట్టపర్తికి మే 15న కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఏపీ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా శంఖుస్థాపన జరిగింది. పుట్టపర్తి చుట్టుపక్కల ప్రాంతాలు డిఫెన్స్, ఏరోస్పేస్ రంగానికి వేదికగా మారుతున్నాయి. డ్రోన్ల తయారీ, ఫైటర్ జెట్స్ విడిభాగాలు, డిఫెన్స్ ఎక్విప్‌మెంట్ తయారీ సంస్థలు ఇక్కడికి రావడం వల్ల... రాయలసీమ పేరు దేశ రక్షణ రంగ మ్యాప్‌లోకి ఎక్కింది.
ఇది ఇక్కడి యువతకు అత్యున్నత స్థాయి టెక్నికల్ ఉద్యోగాలను తెచ్చిపెడుతుంది. తిరుపతి జిల్లాలోని శ్రీసిటీ- ఐటీ, హబ్ గా రూపాంతరం చెందుతూ వస్తోంది. తిరుపతి పరిసర ప్రాంతాలు, మరీ ముఖ్యంగా శ్రీసిటీ ఇప్పటికే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్- EMC గా మారాయి. మనం వాడే ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, గృహోపకరణాలు ఇక్కడే తయారవుతున్నాయి.
తిరుపతి, అనంతపురం నగరాలు క్రమంగా IT కంపెనీలకు కేంద్రాలుగా మారుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద విండ్, సోలార్ పవర్ ప్రాజెక్టులలో కొన్ని కర్నూలు, కడప జిల్లాల్లో ఉన్నాయి. భవిష్యత్తు అంతా గ్రీన్ ఎనర్జీదే కాబట్టి, రాబోయే రోజుల్లో పర్యావరణహిత విద్యుత్ ఉత్పత్తికి రాయలసీమ మదర్ హబ్‌గా నిలవబోతోంది. ఒకప్పుడు కూలి పనుల కోసం బెంగళూరు, చెన్నై, లేదా గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన రాయలసీమ బిడ్డలు...
ఇప్పుడు సొంత ఊరిలోనే లేదా పక్క జిల్లాలోనే గౌరవప్రదమైన జీతాలతో ఇండస్ట్రీస్ లో సెటిల్ అవుతున్నారు. పరిశ్రమల రాకతో నేషనల్ హైవేల విస్తరణ, ఫోర్-లేన్ రోడ్లు, కొత్త రైల్వే లైన్లు వేగంగా పెరుగుతున్నాయి. కడప, తిరుపతి, కర్నూలు, ఓర్వకల్లు, పుట్టపర్తి ఎయిర్‌పోర్టుల కనెక్టివిటీ సీమకు పెద్ద ప్లస్ పాయింట్ అయింది. జేఎన్‌టీయూ, ట్రిపుల్ ఐటీ, కేంద్రీయ విశ్వవిద్యాలయాలతో పాటు ఇండస్ట్రీలకు అవసరమైన స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఇక్కడ రావడం వల్ల స్థానిక యువత గ్లోబల్ ఎంప్లాయ్స్ గా మారుతున్నారు.
ఒకప్పుడు రాయలసీమ ఫ్యాక్షన్ సినిమాల్లో బాంబుల పొగలు, కత్తుల శబ్దాలు వినిపించేవి. కానీ ఇప్పుడు సీమ ఫ్యాక్టరీల్లో మెషీన్ల శబ్దాలు, ప్రగతి చక్రాల పరుగు కనిపిస్తోంది. సీమ పౌరుషం అంటే గొడవలు పడటం కాదు, ప్రపంచ స్థాయి బ్రాండ్లను తయారు చేసి చూపించడం అని ఇక్కడి యువత నిరూపిస్తోంది.

