Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జైలర్ 2 సెట్‌లో విషాదం యువకుడు మృతి షాక్‌లో యూనిట్‌

జైలర్ 2 సెట్‌లో విషాదం యువకుడు మృతి షాక్‌లో యూనిట్‌

సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'జైలర్ 2'. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది.

అయితే, ఈ చిత్ర సెట్‌లో తాజాగా ఒక ఊహించని విషాదం చోటు చేసుకుంది. సెట్ నిర్మాణ పనుల్లో నిమగ్నమైన ఒక యువ కార్మికుడు ప్రమాదవశాత్తు మరణించడం కోలీవుడ్ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని నింపింది. చెన్నై శివార్లలోని పనైయూర్‌లో ఉన్న ఒక ప్రైవేట్ స్టూడియోలో ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. షూటింగ్ కోసం ఆర్ట్ విభాగం భారీ సెట్‌ను రూపొందిస్తోంది.

ఈ క్రమంలో కార్తికేయన్ (28) అనే యువకుడు అక్కడ పని చేస్తుండగా, అకస్మాత్తుగా విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో అతడికి తీవ్రంగా కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ప్రమాదం గమనించిన తోటి సిబ్బంది వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే కార్తికేయన్ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సెట్ వద్ద భద్రతా ప్రమాణాలు ఎలా ఉన్నాయి? ఈ ప్రమాదానికి అసలు కారణం ఏమిటి? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

గత ఏడాది విడుదలైన 'జైలర్' బాక్సాఫీస్ వద్ద రూ. 600 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దీంతో ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. రజనీకాంత్ మార్క్ మాస్ ఎలిమెంట్స్ కు నెల్సన్ స్టైల్ ఆఫ్ మేకింగ్ తోడైతే మళ్ళీ రికార్డులు తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రమాదం జరగడం అందరినీ కలిచివేస్తోంది. వాస్తవానికి ఈ సినిమా ప్రారంభం నుండి ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంది. గతంలో షూటింగ్ స్పాట్ నుండి కొన్ని కీలక ఫోటోలు, వీడియోలు లీక్ అవ్వడం చిత్ర యూనిట్ ను కలవరపెట్టింది. సన్ పిక్చర్స్ సంస్థ ఈ లీకేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది కూడా.

ఇప్పుడు ఏకంగా ఒక ప్రాణం పోవడంతో షూటింగ్‌కు తాత్కాలికంగా విరామం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వార్త తెలుసుకున్న నెటిజన్లు, చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖులు మరణించిన కార్మికుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాల సెట్స్ లో కార్మికుల భద్రతపై మరింత శ్రద్ధ వహించాలని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఈ విచారణ కొనసాగుతుండగా, త్వరలోనే చిత్ర యూనిట్ నుంచి దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరోవైపు, ఈ అడ్డంకులను అధిగమించి 'జైలర్ 2' ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One