పోక్సో కేసులో అరెస్ట్ అయి జ్యుడీషియల్ రిమాండ్ ఎదుర్కొంటున్న బండి భగీరథ్ ప్రస్తుతం చర్లపల్లి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. జైలు నిబంధనల ప్రకారం అధికారులు ఆయనను ఒక సాధారణ ఖైదీగానే పరిగణిస్తూ విచారణ ఖైదీల బ్యారక్‌లోనే ఉంచారు.
ఈ క్రమంలో జైలులో మొదటి రోజు ఆయన అక్కడి భోజనాన్నితినలేదు. జైలు క్యాంటీన్ నుండి తెప్పించుకున్న పాలు, బ్రెడ్డు మాత్రమే తీసుకున్నట్లు సమాచారం. న్యాయస్థానం రెండు వారాల రిమాండ్ విధించడంతో శనివారం ( మే 16) రాత్రి పోలీసులు భగీరథ్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్య పరీక్షలు, ఇతర అధికారిక ప్రక్రియలు పూర్తి చేసిన అనంతరం ఆయనను నేరుగా విచారణ ఖైదీలు ఉండే బ్యారక్‌కు పంపారు.
ఆదివారం ( మే 17) ఖైదీల కోసం ప్రత్యేకంగా వండిన మాంసాహారాన్ని సైతం ఆయన ముట్టలేదని జైలు వర్గాల సమాచారం. మరోవైపు ఈ సంచలన కేసు దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వేగవంతం చేసింది. నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న ఐఫోన్‌తో పాటు బాధితురాలి తల్లి న్యాయస్థానానికి సమర్పించిన కీలక ఆధారాలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్)కి పంపనున్నారు. ఈ కేసులోని మరిన్ని విషయాలను, వాస్తవాలను రాబట్టేందుకు భగీరథ్‌ను పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పేట్ బషీరాబాద్ పోలీసులు కోర్టులో కస్టడీ పిటిషన్‌ను దాఖలు చేయాలని భావిస్తున్నారు.

