Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జనసేనకు బీజేపీ ఝలక్.. గ్రేటర్ ఎన్నికల్లో ఒంటరి పోరుకే మొగ్గు!?

జనసేనకు బీజేపీ ఝలక్.. గ్రేటర్ ఎన్నికల్లో ఒంటరి పోరుకే మొగ్గు!?

నసేనకు బీజేపీ ఝలక్ ఇవ్వనుందా? గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఒంటరి పోరుకే మొగ్గు చూపుతోందా? అంటే కాషాయ వర్గాల నుంచి ఔననే సమాధానమే వస్తున్నది.

జీహెచ్ఎంసీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో విశ్వనగరం హైదరాబాద్ లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతుండటంతో అన్ని ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రస్తుత అధికార పక్షం కాంగ్రెస్ నగరంలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా వ్యూహరచన చేస్తుంటే.. గత ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలను సాధించాలని బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది.

జీహెచ్ఎంసీ గత ఎన్నికల్లో ఊహించని రీతిలో భారీగా స్థానాలను గెలుచుకున్న బీజేపీ, అదే ఊపును 2023 అసెంబ్లీ మరియు 2025 లోక్‌సభ ఎన్నికల్లోనూ కొనసాగించింది. ఈ నేపథ్యంలో, 2026 గ్రేటర్ ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్‌లోని తమ మిత్రపక్షాలైన తెలుగుదేశం, జనసేన పార్టీలతో కలిసి పోటీ చేసి నగరంలో మరింత పట్టు సాధిస్తుందని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరిగింది. ఇటీవల ప్రధాని మోదీతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జరిపిన భేటీ కూడా ఈ పొత్తుల అంచనాలకు మరింత బలాన్ని చేకూర్చింది. అయితే..

క్షేత్రస్థాయిలో తాజా పరిణామాలు పరిశీలిస్తే పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగానే బరిలోకి దిగాలని బీజేపీ నాయకత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అదే నిజమైతే.. ఈ పరిణామం జనసేన పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

2020 గ్రేటర్ ఎన్నికల సమయంలో జనసేన పలు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించినప్పటికీ.. బీజేపీకి అనుకూలంగా చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కూటమి బలంగా ఉన్నందున, ఈసారి హైదరాబాద్‌లో బీజేపీ తమకు సహకరిస్తుందని జనసేన ఆశిస్తోంది. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికలలో బీజేపీ ఒంటరిపోరుకు సిద్ధపడితే మాత్రం..

తెలంగాణలో జనసేనను బలోపేతం చేయాలన్న ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశలకు గండిపడినట్లే అంటున్నారు పరిశీలకులు. ఒకవేళ బీజేపీ మద్దతు లేకుండా జనసేన ఒంటరిగా బరిలోకి దిగితే.. బీజేపీ నష్టపోతుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే గత ఎన్నికలలో లాగే..

జనసేన పోటీకి దూరంగా ఉండేలా బీజేపీ హైకమాండ్ పవన్ కల్యాణ్ ను ఒప్పించాలని రాష్ట్ర బీజేపీ నాయకులు కోరుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య త్రిముఖ పోరు ఉంటేనే.. కమలం వికసించే అవకాశం ఉంటుందన్నది వారి భావన. త్రిముఖ పోరులో గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నప్పుడు జనసేనకు కొన్ని సీట్లు కేటాయించడం ఎందుకన్న భావన వారిలో వ్యక్తం అవుతోంది.

జీహెచ్ఎంసీపై పట్టు సాధిస్తే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో అధికారం చేపట్టాలన్న ఆశయాన్ని నెరవేర్చుకునేందుకు అవకాశలు మెరుగ్గా ఉంటాయని అంటున్నారు. చూడాలి మరి బీజేపీ ఒంటరి పోరు నిర్ణయంపై జనసేన ఎలా స్పందిస్తుందో?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One