Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జవహర్‌నగర్ దోపిడీ కేసు ఛేదన...నేపాలి గ్యాంగ్ అరెస్ట్

జవహర్‌నగర్ దోపిడీ కేసు ఛేదన...నేపాలి గ్యాంగ్ అరెస్ట్

హైదరాబాద్ నగరంలోని జవహర్‌నగర్‌లో ప్రొఫెసర్ దంపతుల ఇంట్లో జరిగిన భారీ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో పాల్గొన్న నేపాలి గ్యాంగ్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

పోలీసుల వివరాల ప్రకారం... సుమారు 20 రోజుల క్రితం మమత, రమేష్ అనే నేపాలి దంపతులు ప్రొఫెసర్ దంపతుల ఇంట్లో పనిమనుషులుగా చేరారు. ఎంతో నమ్మకంగా వ్యవహరిస్తూ యజమానుల విశ్వాసాన్ని సంపాదించారు. ఇదే సమయంలో దోపిడీకి పక్కా ప్రణాళిక రచించినట్లు పోలీసులు తెలిపారు.

రెండు రోజుల క్రితం తన పుట్టినరోజు ఉందని మమత యజమానులకు చెప్పగా, వారు కేక్ తెప్పించి వేడుకకు అనుమతిచ్చారు. బర్త్‌డే పార్టీకి తమ బంధువులు వస్తారని మమత చెప్పడంతో ప్రొఫెసర్ దంపతులు కూడా ఒప్పుకున్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకున్న నిందితులు ముందుగా ప్రణాళిక ప్రకారం పార్టీ నిర్వహించారు. అనంతరం ఇంటి యజమానులు భోజనం చేస్తున్న సమయంలో వారిపై దాడి చేసి, చేతులు కాళ్లు కట్టేసి ఇంట్లో ఉన్న నగదు, బంగారం, విలువైన వస్తువులను దోచుకెళ్లారు.

పారిపోతూ ముందు దంపతులకు మత్తుమందు ఇచ్చి అక్కడి నుంచి పరారయ్యారు. కొంతసేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన రాచకొండ పోలీసులు పరిసర ప్రాంతాల సీసీ కెమెరాలను పరిశీలిస్తూ దర్యాప్తును ముమ్మరం చేశారు. చివరకు మమత, ఆమె భర్త రమేష్‌తో పాటు వారికి సహకరించిన మరో ఇద్దరిని అరెస్టు చేసి, దోపిడీకి సంబంధించిన నగదు, బంగారం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తుండటంతో పోలీసులు కీలక సూచనలు చేశారు. ఇంట్లో పనిమనుషులను నియమించుకునే ముందు వారి పూర్తి వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలని, ముఖ్యంగా ఇతర రాష్ట్రాలు లేదా విదేశాల నుంచి వచ్చిన వారిపై పూర్తి ధృవీకరణ చేసుకోవాలని ప్రజలకు సూచించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One