Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జీసీసీల ఏర్పాటుకు కంపెనీలకు ప్రోత్సాహం : సీఎం రేవంత్

జీసీసీల ఏర్పాటుకు కంపెనీలకు ప్రోత్సాహం : సీఎం రేవంత్

తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహనగరానికే కే కాదు... జిల్లాలకూ ఐటీ వెలుగులు విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. హైదరాబాద్ అవతల కూడా గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు (జీసీసీలు) ఏర్పాటు చేసేలా ప్రత్యేక పాలసీ తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ హైవేల వెంట జీసీసీలు, డేటా సెంటర్లు ఏర్పాటు చేసే కంపెనీలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. బుధవారం ఐటీ, పరిశ్రమల శాఖలపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సంబంధిత శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, సీఎస్ కె. రామకృష్ణారావు, సీఎం ప్రత్యేక కార్యదర్శి బి.

అజిత్ రెడ్డి, టీజీఐఐసీ వీసీ & ఎండీ కె. శశాంక, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి, పరిశ్రమల కమిషనర్ నిఖిల్ చక్రవర్తి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఐటీ, ఇతర ఉద్యోగ అవకాశాలు హైదరాబాద్‌కే పరిమితం కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 'బియాండ్ క్యూర్" (కోర్ అర్బన్ రీజియన్) ప్రాంతాలను గుర్తించి అక్కడ ఐటీ, డేటా సెంటర్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఐటీ విస్తరణ పెద్దగా లేని చోట్ల కూడా డేటా సెంటర్ల ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలని సూచించారు. భారత్ ఫ్యూచర్ సిటీ (బీఎఫ్‌సీ)లో ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో పాటు పర్యావరణహిత నెట్-జీరో విధానాలు అమలు చేయాలని సీఎం ఆదేశించారు. ఏఐ సిటీ, హెల్త్ సిటీ, ఇండస్ట్రియల్ కారిడార్ పనులు వేగవంతం చేయాలని అధికారులను చెప్పారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ప్రకటించిన ఐదు ప్రాంతీయ వైద్య పర్యాటక కేంద్రాల్లో ఒకటి ఫ్యూచర్ సిటీలోని హెల్త్ సిటీ లో ఏర్పాటుకై కేంద్రంతో చర్చలు జరపాలని ఆదేశించారు.

అవసరమైతే గౌరవ ప్రధాన మంత్రితో మాట్లాడుతానన్నారు. ఫ్యూచర్ సిటీ లో ప్రతిపాదిత ఏఐ సిటీ పనులను వెంటనే ప్రారంభించే విధంగా, ప్రపంచంలోనే గొప్ప ఏఐ సదుపాయాలుండేలా చూడాలన్నారు. ఫ్యూచర్ సిటీ పారిశ్రామిక వాడలో వివిధ కంపెనీలకు సంబంధించిన ప్రాంగణాల్లో త్వరలో భూమి పూజ చేసేట్టు, అవసరమైన పనులు చేపట్టాలన్నారు. ఫ్యూచర్ సిటీలో స్థాపించే కంపెనీలన్నీ నైపుణ్యాభివృద్ధి కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ తో ఒప్పందాలు కుదుర్చుకునేలా చూడాలన్నారు.

రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రప్పించేందుకు 'ఇన్వెస్ట్ తెలంగాణ' పేరుతో ప్రత్యేక ఏజెన్సీ ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారు. పెట్టుబడిదారులకు ఒకే వేదికపై అన్ని అనుమతులు, సేవలు అందేలా వ్యవస్థ రూపొందించాలని సూచించారు. ఇన్వెస్ట్ తెలంగాణ పేరు మీద ప్రభుత్వం ఒక సొసైటీ ను ఏర్పాటు చేయనుండగా, ఆ ఏజెన్సీ లో ఐటీ, పరిశ్రమ శాఖలకు సంబంధించిన అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. కాగా, ఎనర్జీ, ఫైనాన్స్ వంటి శాఖల అధికారులు ఇన్వెస్ట్ తెలంగాణలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఉండనున్నారు.

ఈ ఏజెన్సీని ఏర్పాటు చేయడంలో ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఉత్తమ విధానాలను అవలంభించాలన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులతో వచ్చే కంపెనీలకు సంపూర్ణంగా తోడ్పాటునందిస్తూ సహకరించే విధంగా ఇన్వెస్ట్ తెలంగాణ పని చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మూడు నెలల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు టీ-ఫైబర్ ఇంటర్నెట్ వినియోగంలోకి రావాలని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికే టీ-ఫైబర్‌కు మారిన ప్రభుత్వ కార్యాలయాల నుంచి రూ.54 కోట్ల ఆర్డర్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One