Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేజీ బేసిన్ గ్యాస్ వివాదంలో రిలయన్స్‌కు చుక్కెదురు

కేజీ బేసిన్ గ్యాస్ వివాదంలో రిలయన్స్‌కు చుక్కెదురు

కేజీ బేసిన్ అంటే కృష్ణా గోదావరి బేసిన్. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, గోదావరి నదుల డెల్టా ప్రాంతం, సముద్ర తీరంలో విస్తరించి ఉన్న ఒక అతిపెద్ద సహజ చమురు, గ్యాస్ నిక్షేపాలున్న ప్రాంతం.

కేజీ బేసిన్‌లోని డి-6 బ్లాక్ లో రిలయన్స్ సంస్థ భారీగా గ్యాస్ నిక్షేపాలను కనుగొని, ఉత్పత్తి చేస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఓఎన్‌జీసీ కూడా ఈ బేసిన్ లోని పలు బ్లాకుల్లో చమురు, గ్యాస్ అన్వేషణ, వెలికితీత పనులు చేపడుతోంది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన కేజీ బేసిన్ గ్యాస్ తరలింపు వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రూ.12,800 కోట్ల విలువైన ఈ భారీ సహజ వాయువు వివాదంపై విచారణను నిలిపివేయాలన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.

దీంతో ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతుందని స్పష్టమైంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశంపై స్పష్టమైన వ్యాఖ్యలు చేయడం దేశ కార్పొరేట్, ఆయిల్, గ్యాస్ రంగాల్లో పెద్ద చర్చకు దారితీసింది. కేంద్రప్రభుత్వంతో మధ్యవర్తిత్వానికి సిద్ధమని రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. ఈ చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటామని కోర్టుకు రిలయన్స్ లాయర్లు తెలిపారు.

సామరస్యపూర్వక పరిష్కారానికి వస్తేనే ఈ కేసు మూసివేస్తామని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఈ కేసు విచారణ నిలిపివేతపై కేంద్రప్రభుత్వం, ఓఎన్‌జీసీ అభ్యంతరం వ్యక్తం చేశాయి. భూగర్భం నుంచి రిలయన్స్ బ్లాక్‌లోకి సహజ వాయువు తరలింపుపై సుదీర్ఘ వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఓఎన్‌జీసీ గ్యాస్‌ను రిలయన్స్ అక్రమంగా వెలికితీసిందంటూ గతంలో కేంద్రం నోటీసులు జారీ చేసిన విషయం విదితమే.

కేంద్రం రికవరీ నోటీసులను సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు గతంలో తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ముకేశ్ అంబానీ సంస్థ ఆశ్రయించింది. ఈ కేసు ఫలితంపై ఆయిల్, గ్యాస్ కార్పొరేట్ రంగంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One