భారత విద్యా వ్యవస్థలో దశాబ్దాలుగా నడుస్తున్న కీలకమైన విధానపరమైన నిర్ణయాలు, పాఠ్యపుస్తకాల రూపకల్పన, విద్యా విధానంపై ఆధిపత్య పోరు రసవత్తర మలుపు తిరిగింది.
నీట్-యుజి ప్రశ్నాపత్రం లీకేజీ వివాదం తీవ్రరూపం దాల్చడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గత నెల25న తన పదవికి రాజీనామా చేశారు. ఈ ఊహించని పరిణామం కేవలం ఒక మంత్రి రాజీనామాకే కాకుండా.. దేశంలో విద్యపై ఎవరి నియంత్రణ ఉండాలి అనే అంశంపై చర్చకు దారితీసింది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి విద్యా రంగం రాజ్యాంగ విలువలను నూరిపోయడంతో పాటు ఒక నిర్దిష్టమైన సిద్ధాంతాన్ని, భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఉపయోగపడింది.
గతంలో చరిత్ర పుస్తకాల్లో స్వదేశీ వీరులకు తక్కువ ప్రాధాన్యం ఇవ్వడం, భారత సాంప్రదాయ జ్ఞానాన్ని పక్కన పెట్టడం వంటి అంశాలు ఒక రకమైన ఎకోసిస్టమ్‌లో భాగమయ్యాయి. 2014లో నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితిలో మార్పులు తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ధర్మేంద్ర ప్రధాన్ 2021లో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జాతీయ విద్యా విధానం 2020 అమల్లోకి తెచ్చేందుకు వేగవంతమైన చర్యలు చేపట్టారు. జాతీయ పాఠ్యాంశాల రూపకల్పన , పిఎం శ్రీ పాఠశాలలు, అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్, భారతీయ జ్ఞాన వ్యవస్థలకు ప్రాధాన్యం కల్పించడం వంటి అనేక సంస్కరణలు ఆయన హయాంలోనే రూపుదిద్దుకున్నాయి.
బట్టీ పద్ధతి నుంచి విద్యార్థుల సృజనాత్మకతకు పెద్దపీట వేసే బహుళ కోర్సుల విధానానికి ఈ మార్పులు దోహదపడ్డాయి. అయితే, అదే సమయంలో దేశంలో ప్రధాన పరీక్షల నిర్వహణలో తీవ్ర అక్రమాలు వెలుగుచూశాయి. 2024 నుంచి ప్రారంభమైన నీట్-యుజి, యుజిసి-నెట్ పరీక్షల వివాదాలు, గ్రేస్ మార్కుల కేటాయింపు, లీకేజీ ఆరోపణలు దుమారం రేపాయి. తాజాగా మే 3, 2026న జరిగిన నీట్-యుజి పరీక్షలో ప్రశ్నాపత్రం లీక్ కావడం, కోచింగ్ సెంటర్ల పాత్ర బయటపడటంతో వివాదం ముదిరింది.
దీనితో పరీక్షను రద్దు చేసి సిబిఐ దర్యాప్తునకు ఆదేశించడమే కాకుండా రీ ఎగ్జామ్ కూడా నిర్వహించాల్సి వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో విద్యార్థి సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు జంతర్ మంతర్ వద్ద భారీ స్థాయిలో నిరసనలు చేపట్టాయి. పరీక్షల నిర్వహణ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని, ఈ పరిస్థితికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీకి తన రాజీనామా లేఖను సమర్పిస్తున్నట్లు ధర్మేంద్ర ప్రధాన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
దేశంలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ తో ముడిపడి ఉన్న నీట్ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల పారదర్శకత అనేది రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వ హక్కుతో ముడిపడి ఉంది. ఎగ్జామ్ మాఫియా, కోచింగ్ సెంటర్ల దందా వల్ల ప్రతిభావంతులైన విద్యార్థులకు అన్యాయం జరుగుతుందనే ఆందోళన తీవ్రమైంది. పరీక్షలను కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో నిర్వహించడం, కఠినమైన చట్టాలు తీసుకురావడం వంటి చర్యలను ప్రభుత్వం విస్తృతం చేసింది. మరోవైపు ప్రధాన్ హయాంలో ఎన్సిఇఆర్టి పాఠ్యపుస్తకాలలో మార్పులు చేసి..
ప్రాచీన భారతీత శాస్త్రవేత్తలు, గణిత శాస్త్రజ్ఞులు, దేశ సంస్కృతికి పెద్దపీట వేయడంపై భినాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. చరిత్రను కేవలం వైఫల్యాల కోణంలోనే కాకుండా భారత నాగరికత ప్రతిభను చాటేలా మార్చారని కొందరు మద్దతు పలకగా, భావజాల రుద్దింపు అని ప్రత్యర్థులు విమర్శించారు. ఈ వివాదాల నడుమ నీట్ లీక్ అంశం విపక్షాలకు, నిరసనకారులకు బలమైన ఆయుధంగా మారింది. ప్రస్తుతం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో విద్యాశాఖలో తక్షణ సంక్షోభం తాత్కాలికంగా ముగిసినట్లు కనిపించినా, అసలు సమస్యలు ఇంకా మిగిలే ఉన్నాయి.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రీఫార్మ్స్, పాఠ్యపుస్తకాల పునర్నిర్మాణం, నూతన విద్యా విధానం అమల్లోకి తీసుకురావడం రాబోయే రోజుల్లో కొత్త విద్యామంత్రికి సవాలుగా మారనున్నాయి. కేవలం ఒక వ్యక్తి రాజీనామాతో సరిపెట్టకుండా, పరీక్షల నిర్వహణ వ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు సమగ్రమైన చర్యలు చేపట్టాలని ప్రజలు, విద్యావేత్తలు కోరుతున్నారు. - సీతారాం కంఠంనేని ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి మా https://TeluguOne.com పోర్టల్‌ను అనుసరించండి, మీ స్నేహితులతో పంచుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి. Dharmendra Prasad Resign, , Neet Leak, , Union Education Minister, , NEET UG controversy, Telugu One

