జనగణనలో కుల గణన లెక్కింపుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ స్వాగతించారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కుల గణన నిర్వహించి 'ఎవరెంతో వారికంతా' అనే సామాజిక న్యాయ సూత్రంతో ముందుకు సాగుతోందని తెలిపారు.
తెలంగాణ మాదిరిగానే దేశవ్యాప్తంగా కూడా కుల గణన చేపట్టాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారని చెప్పారు. గతంలో కేంద్ర ప్రభుత్వం జనగణనలో కుల గణన చేస్తామని హామీ ఇచ్చినా, తర్వాత కాలమ్-13లో బీసీల అంశాన్ని చేర్చలేదని మంత్రి గుర్తుచేశారు. ఇటీవల ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా కాలమ్-13లో ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీల గణన కూడా చేర్చాలని కోరినట్లు తెలిపారు. కుల గణనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడం సామాజిక న్యాయానికి బలాన్నిచ్చే పరిణామమని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
జనగణనలో కుల గణన చేపడితేనే బలహీన వర్గాలకు సముచిత న్యాయం జరుగుతుందని అన్నారు. కుల గణన ద్వారా ఖచ్చితమైన లెక్కలు అందుబాటులోకి వచ్చినప్పుడే సంక్షేమ పథకాల అమలు, రిజర్వేషన్ల పంపిణీ మరింత పారదర్శకంగా జరుగుతుందని వివరించారు. ప్రజాపాలన ప్రభుత్వం బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో కుల గణన నిర్వహించి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేలా చట్టం చేసిందని మంత్రి తెలిపారు. అయితే ఆ బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉందని, కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

