Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
క్యూబాతో యుద్దానికి డొనాల్డ్ ట్రంప్ రెడీ అయ్యారా?

క్యూబాతో యుద్దానికి డొనాల్డ్ ట్రంప్ రెడీ అయ్యారా?

ప్రపంచ వ్యాప్తంగా 8 యుద్దాలు ఆపాను.. తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని నానా హడావుడి చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్దకాంక్ష ఎప్పటికప్పుడు ప్రస్పుటమవుతూనే ఉంది.

ట్రంప్ రెండో సారి అగ్రరాజ్య అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక అలజడికి కారణమవుతూనే ఉన్నారు. ఒక వైపు ఇరాన్‌ - అమెరికా యుద్దంతో అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు పెరుగుతూ, ప్రపంచ దేశాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా మరో యుద్ధానికి సిద్ధమైందేమోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా కాలంగా క్యూబాపై గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో కరీబియన్ సముద్ర జలాల్లోకి తాజాగా యూఎస్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ నిమిట్జ్ సారథ్యంలోని నావికాదళం ప్రవేశించడంతో ఆందోళన పతాకస్థాయికి చేరింది. విమానవాహక నౌక యూఎస్ఎస్ నిమిట్జ్‌తో పాటు, పలు యుద్ధ నౌకలు కరీబియన్ జలాల్లోకి ప్రవేశించినట్టు యూఎస్ సదరన్ కమాండ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో తదుపరి ఏం జరుగుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. క్యూబాపై చాలాకాలంగా దృష్టిపెట్టామని ట్రంప్ బుధవారం (మే 20న) పేర్కొన్నారు.

క్యూబా మాజీ అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రోపై అమెరికా న్యాయశాఖ హత్యారోపణలతో కేసు దాఖలు చేసిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. 1996లో అంతర్జాతీయ జలాల్లో రెండు విమానాలు కూలిన ఘటనలో పలువురు మరణించడంపై ట్రంప్ ప్రభుత్వం ఈ నేరారోపణ చేసింది. క్యూబా స్వాతంత్ర్య దినోత్సవం రోజునే ట్రంప్ ప్రభుత్వం ఈ ప్రకటన చేయడంతో కలకలం రేగుతోంది. ఇక క్యూబా చమురు ఎగుమతులకు చెక్ పెట్టేలా ఆ దేశాన్ని దిగ్బంధించడాన్ని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి బుధవారం సమర్థించుకున్నారు.

క్యూబా ప్రజల ఇక్కట్లకు అక్కడి ప్రభుత్వమే కారణమని అన్నారు. ఇక అమెరికా నిఘా సంస్థ సీఐఏ డైరెక్టర్ జాన్ ర్యాట్‌క్లిఫ్ గతవారమే క్యూబా అధికారులతో సమావేశం సందర్భంగా పలు హెచ్చరికలు చేసినట్టు కూడా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇరు దేశాల మధ్య డీల్ కుదుర్చుకునేందుకు ఎక్కువ సమయం లేదని ఆయన హెచ్చరించినట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One